Friday, 22 June 2018

VRO ONLINE CLASS 1

VRO ONLINE CLASS
1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
DAY 1
వర్తమానాంశాలు - ప్రాంతీయం - 1
టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వర్తమాన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి.
రాష్ట్ర ఆవిర్భవం నుంచి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, బంగారు తెలంగాణ సాధన దిశగా అమలు చేస్తున్న పథకాల
గురించి సమగ్రంగా తెలుసుకుంటే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.
కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
ప్రజల జీవన స్థితిగతులను అధ్యయనం చేస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ అభివృద్ధికి పలు కార్యక్రమాలను చేపడుతోంది. అవి..
సమగ్ర కుటుంబ సర్వే - 2014
* సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ప్రభుత్వం 2014 ఆగస్టు 19న రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వేని చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి సమగ్రమైన, పటిష్టమైన గణాంక సమాచార వివరాలను సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం.
* అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారి వ్యక్తిగత అవసరాలే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడానికి సమగ్ర కుటుంబ సర్వే దోహదపడుతుంది.
* ఈ సర్వే ప్రకారం అత్యధికంగా 16.56 లక్షల కుటుంబాలు రంగారెడ్డి జిల్లాలోనూ, అత్యల్పంగా 6.97 లక్షల కుటుంబాలు నిజామాబాద్ జిల్లాలోనూ ఉన్నాయి.
ఆహార భద్రత
* ఆహార భద్రత కార్డులకు అర్హులైన కుటుంబాలకు 2015 జనవరి 1 నుంచి మనిషికి ఆరు కిలోల చెప్పున, రూపాయికే కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* ఇంతకు ముందు మనిషికి 4 కిలోలు చొప్పున, కటుంబానికి 20 కిలోలకు మించి బియ్యం ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం కుటుంబంలో ఎంత మంది సభ్యులున్నా.. మనిషికి 6 కిలోలు వంతున బియ్యాన్ని ఇస్తున్నారు.
* అంత్యోదయ అన్న యోజన(ఏఏవై) కింద ఎంపికైన కుటుంబాలకు కిలో రూపాయి ధరకు నెలకు 35 కిలోల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
* ఇంతవరకు తెలంగాణలో ఆహార భద్రత కార్డులకు అర్హులుగా 87.57 లక్షలు కుటుంబాలను గుర్తించారు. అంత్యోదయ అన్న యోజన కార్డులకు 49 వేల మంది అర్హులను గుర్తించారు.
సన్న బియ్యం పథకం
* హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్థులకు పుష్టికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం సూపర్‌ఫైన్ రకం (సన్న బియ్యం) బియ్యాన్ని సరఫరా చేస్తుంది.
హరితహారం
* హరితహారం కార్యక్రమాన్ని 2015 జులై 3న ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా 'చిలుకూరు'లో ప్రారంభించారు.
* రాష్ట్రంలో అడవుల శాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచడం హరితహారం లక్ష్యం. ఇందులో భాగంగా వచ్చే మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 230 కోట్ల మొక్కలను పెంచడం లక్ష్యం.
సామాజిక భద్రతకు 'ఆసరా'
* ఆసరా అనేది సామాజిక భద్రతా పింఛన్ల కార్యక్రమం. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేతపనివారు, కల్లుగీత పనివారు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులు సామాజిక భద్రతతో రోజువారీ కనీస అవసరాలను తీర్చుకోవడానికి ఈ పథకం అండగా నిలుస్తుంది.
* ఈ పథకంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, కల్లుగీత పనివారు, నేతపనివారు, హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులకు గతంలో నెలకు రూ. 200 చెల్లించేవారు. ప్రస్తుతం దీన్ని వెయ్యి రూపాయలకు పెంచారు. వికలాంగులకు నెలకు రూ. 500 ఇచ్చేవారు, ప్రస్తుతం రూ. 1500 చెల్లిస్తున్నారు.
* 2015 నుంచి బీడీ కార్మికుల్లోని మహిళలకు కూడా 'ఆసరా' పథకం కింద ఆర్థిక సాయాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి కూడా రూ.1000 జీవన భృతి కల్పిస్తున్నారు.
తాగునీటి సరఫరా పథకం
* తెలంగాణ తాగునీటి సరఫరా ప్రాజెక్ట్ (టీడీడబ్ల్యూఎస్పీ) కింద హైదరాబాద్ మినహా.. 9 జిల్లాల్లోని 25,139 ఆవాసాలు, 67 మున్సిపాలిటీల పరిధిలో నివసిస్తున్న 3.19 కోట్ల జనాభాకు ప్రతిరోజూ తాగునీటిని అందిస్తారు.
* ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయనున్నారు. తెలంగాణ తాగునీటి సరఫరా పథకం పైలాన్‌ని 2015 జూన్ 8న నల్గొండ జిల్లా 'చౌటుప్పల్‌లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
* ప్రాజెక్టు ముఖ్యాంశాలు: 1) ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సురక్షిత తాగునీరు. 2) ప్రతి వ్యక్తికి రోజుకు గ్రామాల్లో 100 లీటర్లు, పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల నీటి సరఫరా. 3) 25 వేల జనావాసాలకు పైప్‌లైన్‌తో తాగునీటిని అందించడం. 4) ప్రాజెక్టులో 10 శాతం పారిశ్రామిక అవసరాలకు కేటాయింపు. 5) నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కలిగించడం.
గ్రామజ్యోతి (తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకం)
* ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015 ఆగస్టు 17న వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.
* ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడతారు.
* ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా.. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన, సహజవనరుల నిర్వహణ, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పనకు ఈ కార్యక్రమం ద్వారా అధిక ప్రాధాన్యం ఇస్తారు.
* 'గ్రామసభ'లో గ్రామాభివృద్ధి ప్రణాళిక తయారీ - ప్రజల సమష్టి భాగస్వామ్యంతో సమ్మిళిత - సమీకృత అభివృద్ధిని సాధించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.
పారదర్శకత, జవాబుదారీతనం, సాధికారత, ప్రోత్సాహకాలతో లక్ష్య సాధన.
* 'గ్రామజ్యోతి'లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 7 గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేస్తారు. అవి.. 1) పారిశుద్ధ్యం - తాగునీరు 2) ఆరోగ్యం - పోషకాహారం 3) విద్య 4) సామాజిక భద్రత - పేదరిక నిర్మూలన 5) సహజవనరుల నిర్వహణ 6) వ్యవసాయం 7) మౌలిక వసతులు
* ప్రతి కమిటీలో అయిదుగు సభ్యులుంటారు. గ్రామసభ ఆమోదంతో రంగాల వారీగా ప్రణాళికల రూపకల్పన, వనరుల కేటాయింపు, ఫలితాలను రాబట్టడం ఈ కమిటీల ప్రధాన విధులు.
పల్లె ప్రగతి
* నిరుపేదల జీవనాభివృద్ధికి 'తెలంగాణ పల్లెప్రగతి' పథకాన్ని 2015 ఆగస్టు 22న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది.
* రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అత్యంత పేదరికంలో మగ్గుతున్న 150 మండలాల్లో అయిదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.
* పథకం మొత్తం వ్యయం రూ. 642 కోట్లు (ఇందులో రూ. 450 కోట్లు ప్రపంచ బ్యాంకు ఇస్తుంది).
పథకం లక్ష్యాలు: గ్రామస్థాయిలో పేదల కోసం 2.5 లక్షల ఉత్పత్తిదారుల సంఘాలు, కృషిమార్టుల ఏర్పాటు ద్వారా ఆదాయాన్ని పెంచడం.
* వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలకువల్లో శిక్షణ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకలు పెంపకంతో పాటు వరి, తృణధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో చేయూతనందించడం.
* 2.5 లక్షల పేద కుటుంబాల్లో ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడం. 150 మండలాల్లో అందరూ మరుగుదొడ్లు వినియోగించుకునేలా చూడటం.
* 1000 గ్రామ పంచాయతీల్లో 'పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు.
వర్తమానాంశాలు - జాతీయం -1
జనరల్ స్టడీస్‌లో వర్తమానాంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో భాగంగా జాతీయస్థాయి ప్రధాన సంఘటనలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి ఏయే అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గమనించి ప్రణాళిక ప్రకారం చదవాలి. ప్రతి వార్త చదువుకుంటూ పోతే విలువైన సమయం వృథా అవుతుంది.
'నీతి ఆయోగ్' గా ప్రణాళికా సంఘం
ప్రణాళికా సంఘం పేరును 2015 జనవరి 1న 'నీతి ఆయోగ్ గా మార్చారు. ప్రణాళికా సంఘాన్ని రద్దుచేసి దాని స్థానంలో సరికొత్త వ్యవస్థను తీసుకువస్తామని 2014 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రణాళికా సంఘం పేరు మార్చారు. భారత పరివర్తనకు జాతీయ సంస్థ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా - ఎన్ఐటీఐ) సంక్షిప్త రూపమే నీతి. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారు.
భారత్‌లో నూతన అమెరికా రాయబారి
భారత్‌లో నూతన అమెరికా రాయబారిగా నియమితులైన రిచర్డ్ వర్మ (46 సంవత్సరాలు) 2015 జనవరి 2న దిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. భారత రాయబారిగా నియమితులైన మొదటి భారతీయ అమెరికన్‌గా ఈయన రికార్డు సృష్టించారు.
ఐసీఐసీఐ డిజిటల్ విలేజ్ కార్యక్రమం
ఐసీఐసీఐ గ్రూప్ చేపట్టిన 'డిజిటల్ విలేజ్ కార్యక్రమాన్ని 2015 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ముంబయిలో ప్రారంభించారు. గుజరాత్‌లోని అకోదర గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐసీఐసీఐ బ్యాంకు నగదు రహిత బ్యాంకింగ్, ఈ-హెల్త్, డిజిటలైజ్డ్ పాఠశాలలు, మండీలు మొదలైనవాటితో ఆ గ్రామాన్ని డిజిటల్ విలేజ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. అన్ని విషయాల్లోనూ టెక్నాలజీ ప్రయోజనాలను స్థానికులకు అందుబాటులోకి తేవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
102వ భారత సైన్స్ కాంగ్రెస్
102వ భారత సైన్స్ కాంగ్రెస్‌ను 2015 జనవరి 3 నుంచి 7 వరకు ముంబయి విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. ప్రాచీన భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు, వైమానిక రంగం, శస్త్ర చికిత్సలు, గణిత శాస్త్రం తదితర అంశాలపై చర్చ జరిగింది. భారత సైన్స్ కాంగ్రెస్‌తోపాటు, 'బాలల సైన్స్ కాంగ్రెస్, మహిళల సైన్స్ కాంగ్రెస్ లను కూడా నిర్వహించారు.
వైమానిక దళంలో చేరిన తేజస్
దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన అధునాతన తేలికపాటి యుద్ధవిమానం (ఎల్‌సీఏ - లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) తేజస్ 2015 జనవరి 17న భారత వైమానిక దళంలో చేరింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో కాలం చెల్లిన 'మిగ్-21 పోరాట విమానాల స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎల్‌సీఏను 1983లో ప్రభుత్వం మంజూరు చేసింది. అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టులో తీవ్ర జాప్యం జరిగింది. అన్ని ఇబ్బందులను అధిగమించిన ఎల్‌సీఏ 2001 జనవరి 4న తొలిసారిగా గగన విహారం చేసింది. 2003లో నాటి ప్రధాని వాజ్‌పేయి ఈ యుద్ధ విమానానికి 'తేజస్ అని నామకరణం చేశారు.
గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి నేలమీదున్న, గగనతలం నుంచి సముద్రం మీదున్న లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు. తేజస్ పొడవు 13.2 మీటర్లు, ఎత్తు 4.4 మీటర్లు, రెక్కల విస్తీర్ణం 8.2 మీటర్లు. దీని గరిష్ఠవేగం 1.6 మ్యాక్.ఒక పైలట్ తేజస్‌ను నియంత్రిస్తారు.
13వ ప్రవాసీ భారతీయ దివస్
13వ ప్రవాసీ భారతీయ దివస్‌ను 2015 జనవరి 7 నుంచి 9 వరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించారు. దక్షిణాఫ్రికాలో 21 ఏళ్లు గడిపిన తర్వాత 1915 జనవరి 9న గాంధీజీ భారత్‌కు తిరిగివచ్చారు. ఆయన రాకను గౌరవిస్తూ ప్రవాస భారతీయుల కోసం 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివస్‌ను ప్రారంభించింది. 2015 జనవరి 9కి గాంధీజీ మాతృదేశానికి వచ్చి వందేళ్లు అయిన సందర్భంగా ఈసారి మహాత్ముడి సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రవాసీ భారతీయ దివస్‌ను నిర్వహించారు.
ఇస్రో కొత్త చీఫ్‌గా కిరణ్ కుమార్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నూతన అధిపతిగా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా ప్రముఖ శాస్త్రవేత్త ఎ.ఎస్. కిరణ్‌కుమార్ 2015 జనవరిలో నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. కర్ణాటకకు చెందిన కిరణ్ గతంలో అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) డైరెక్టర్‌గా పనిచేశారు.
స్వచ్ఛ భారత్‌కు యూఎస్ ఎయిడ్, గేట్స్ ఫౌండేషన్‌ల సాయం
భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛభారత్ కార్యక్రమానికి సహకరించడానికి యూఎస్ ఎయిడ్, బిల్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సంస్థలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అయిదేళ్లపాటు గేట్స్ ఫౌండేషన్ ఏటా 25 లక్షల డాలర్లు, యూఎస్ ఎయిడ్ సంస్థ ఏటా 20 లక్షల డాలర్లను అందిస్తాయి.
భారత్‌లో పల్స్ పోలియో
2015లో దేశవ్యాప్తంగా తొలి పల్స్ పోలియో కార్యక్రమాన్ని జనవరి 18న నిర్వహించారు. భారత్‌లో చివరిసారిగా జనవరి 13, 2011లో పోలియోను పశ్చిమ బంగలో గుర్తించారు. భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2014 మార్చి 27న ప్రకటించింది. పోలియోచుక్కల కార్యక్రమాన్ని మనదేశం 1995 నుంచి అమలు చేస్తోంది.
సెన్సార్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా పహ్లాజ్ నిహలానీ
కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్‌సీ) నూతన ఛైర్‌పర్సన్‌గా 2015 జనవరిలో ప్రఖ్యాత చిత్ర నిర్మాత పహ్లాజ్ నిహలానీ నియమితులయ్యారు. లీలా శాంసన్ స్థానంలో నియమితులైన పహ్లాజ్ ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగుతారు. బోర్డు ఛైర్‌పర్సన్‌తోపాటు 9 మంది కొత్త సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. వీరిలో తెలుగు నటి జీవితా రాజశేఖర్ కూడా ఉన్నారు.
దేశంలో పెరిగిన పులుల జనాభా
2014 నాటికి దేశంలో పులుల సంఖ్య 2,226కు చేరుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2010తో పోలిస్తే ఈ పెరుగుదల సుమారు 30.5 శాతంగా ఉన్నట్లు అధికార గణాంకాలు వెల్లడించాయి. 2006లో పులుల గణాంకాలు సేకరించినప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ ఏడాది వాటి సంఖ్య కేవలం 1,411 గా నమోదైంది. 2010 నాటికి ఆ సంఖ్య 1,706 కు చేరుకుంది. కర్ణాటకలో అత్యధికంగా 406 పులులు ఉన్నాయి. తర్వాతి స్థానంలో ఉత్తరాఖండ్ (340), మధ్యప్రదేశ్(308) రాష్ట్రాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పులుల సంఖ్య 68గా నమోదైంది.
'హృదయ్‌'కు ఎంపికైన 12 పట్టణాలు
సుసంపన్న సాంస్కృతిక వారసత్వ పునరుత్తేజం, సంరక్షణకు ఉద్దేశించిన జాతీయ వారసత్వ అభివృద్ధి, సదుపాయాల పెంపు పథకం 'హృదయ్ (HRIDAY - హెరిటేజ్ సిటీ డెవలప్‌మెంట్ అడ్ ఆగ్‌మెంటేషన్ యెజన)ను కేంద్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు 2015 జనవరి 21న దిల్లీలో ప్రారంభించారు. హృదయ్ పథకం కింద తొలిదశలో ఎంపికైన 12 పట్టణాలు అమరావతి(ఆంధ్రప్రదేశ్), వరంగల్(తెలంగాణ), అమృత్‌సర్(పంజాబ్), అజ్మీర్(రాజస్థాన్), బదామి(కర్ణాటక), కాంచీపురం, వెల్లంకని(తమిళనాడు), మధుర, వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్); గయ(బిహార్), ద్వారక(గుజరాత్), పూరి(ఒడిశా). ఆయా పట్టణాల జనాభా ఆధారంగా వచ్చే రెండేళ్లలో ఖర్చు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది.
వారణాసికి అత్యధికంగా రూ.89.31 కోట్లు, వరంగల్‌కు రూ.40.54 కోట్లు, అమరావతికి రూ.22.26 కోట్లు కేటాయించింది. 'హృదయ్ పథకం తొలిదశకు ఎంపికైన 12 పట్టణాల అభివృద్ధికి మొత్తం రూ.500 కోట్లను ప్రకటించింది.
వెంచర్ క్యాపిటల్ ఫండ్ పథకం
షెడ్యూల్డ్ కులాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహాయం అందించే వెంచర్ క్యాపిటల్ ఫండ్, హరిత వ్యాపార పథకాలను 2015 జనవరిలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దిల్లీలో ప్రారంభించారు. 200 కోట్ల రూపాయల మూలనిధితో షెడ్యూల్డ్ కులాల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ప్రారంభించారు. హరిత వ్యాపార పథకం కింద ఈ-రిక్షా, సోలార్ పంపు, సౌరశక్తి ఉపకరణాలు మొదలైనవాటిని పొందేందుకు ఎస్సీలకు ఒక లక్ష రూపాయాల వరకు వడ్డీ రాయితీతో రుణాలు ఇస్తారు.
వైబ్రంట్ గుజరాత్ సదస్సు
2015 జనవరిలో గుజరాత్ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో 'వైబ్రంట్ గుజరాత్ (ఉజ్వల గుజరాత్) శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐరాస సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్, భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్గేతోపాటు వివిధ దేశాల నుంచి విశిష్ట అతిథులు, పారిశ్రామిక దిగ్గజాలు, వందకుపైగా ఫార్చ్యూన్ కంపెనీలు ఈ సదస్సుకు హాజరయ్యాయి. గుజరాత్ వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధికి ఉద్దేశించిన ఈ సదస్సును 2003 నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ 2003లో ఈ సదస్సును ప్రారంభించారు.
వ‌ర్త‌మానాంశాలు - అంత‌ర్జాతీయం -1
అంతర్జాతీయంగా 2015లో చోటు చేసుకున్న ప్రధాన అంశాలివి. వీటిలో శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు.. నేపాల్‌ను వణికించిన భూకంపం.. ఐఎస్ ఉగ్రవాద చర్యలు.. జపాన్‌లో పెరుగుతున్న వృద్ధ జనాభా వంటివి ఉన్నాయి. భారత్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు, కీలక ఒప్పందాలు.. హైదరాబాద్ నిజాం నిధుల కేసులో భారత్ విజయం.. గణతంత్ర వేడుకలకు ఒబామా రాక వంటి విశేషాల సమాహారం.
ఇదే తొలిసారి..
* 66వ భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. ఈ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారి. 2015 జనవరి 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు భారత్‌లో పర్యటించిన ఒబామా గణతంత్ర వేడుకల్లో కూడా పాల్గొన్నారు.
* భారత్ - అమెరికా పౌర అణు ఒప్పందంలో ఆరేళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. వాణిజ్య, రక్షణ రంగాల్లో పరస్పర సహకారానికి రెండు దేశాలూ నిర్ణయించాయి. తొలిసారిగా రెండు దేశాల అగ్రనేతలు, జాతీయ సలహాదారుల మధ్య హాట్‌లైన్ ఏర్పాటు చేసుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. ఒబామా, మోదీల మధ్య చర్చల అనంతరం రెండు దేశాలూ 'చలే సాత్ సాత్' పేరుతో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
చదువుల్లో బాలికల ముందంజ
* ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం దేశాల్లో చదువుల్లో బాలుర కంటే బాలికలే ఉత్తమంగా నిలుస్తున్నట్లు గ్లాస్గో, మిస్సౌరీ విశ్వవిద్యాలయాల మానసిక శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. గణితం, సాహిత్యం, శాస్త్ర సంబంధిత అంశాల్లో 15 ఏళ్ల బాలికలు తమ తోటి బాలుర కంటే మెరుగ్గా ఉంటున్నట్లు సర్వేలో తేలింది. 2000-2010 మధ్య ప్రపంచంలోని వివిధ దేశాల్లో విద్యాభ్యాసం చేసిన 1.50 కోట్ల మంది 15 ఏళ్లలోపు బాలబాలికలకు వచ్చిన మార్కులపై సమగ్ర అధ్యయనం చేశాక ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
* సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న దేశాల్లో కూడా బాలబాలికల మధ్య విద్యాపరంగా అంతరం ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. లింగ సమానత తక్కువగా ఉన్న ఖతార్, జోర్డాన్, యూఏఈ లాంటి దేశాల్లోనూ ఫలితాలు ఇలాగే ఉండటం విశేషం.
ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) దుశ్చర్య
* 2015 ఫిబ్రవరిలో ఈజిప్టునకు చెందిన 21 మంది క్రిస్టియన్ కార్మికులను ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు లిబియాలో దారుణంగా హతమార్చిన ఘటన సభ్య సమాజాన్ని కలిచివేసింది. లిబియా రాజధాని ట్రిపోలీ సమీపంలోని సముద్ర తీరంలో 21 మంది కార్మికులను హతమార్చిన దృశ్యాలున్న వీడియోను ఐఎస్ ఉగ్రవాదులు ఆన్‌లైన్‌లో ఉంచారు. లిబియాలోని సిర్తె పట్టణంలో వీరిని ఐఎస్ ఉగ్రవాదులు అపహరించి ఈ ఘటనకు పాల్పడ్డారు.
శ్రీలంకతో ఒప్పందాలు
* భారత్ - శ్రీలంక దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే రీతిలో 2015 ఫిబ్రవరి 16న రెండు దేశాలూ పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. రక్షణ, భద్రత పరమైన సహకారాన్ని పరస్పరం అందించుకోవాలని నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
* అణు సంబంధిత సాంకేతికతను బదలాయించుకోవడం, వనరులను పంచుకోవడం, సిబ్బందికి శిక్షణ, రేడియో ఐసోటోపుల వినియోగం, అణుభద్రత, రేడియో ధార్మికత నుంచి రక్షణ లాంటి అంశాల్లో ఇరు దేశాలు సహకరించుకుంటాయి. రేడియో ధార్మిక వ్యర్థాల యాజమాన్యం, అణు విపత్తులను తట్టుకోవడం, పర్యావరణ పరిరక్షణ రంగాల్లోనూ సహకారాన్ని పరస్పరం అందించుకుంటాయి.
* నలంద విశ్వవిద్యాలయం పునర్నిర్మాణ పథకంలో శ్రీలంకకు భాగస్వామ్యం కల్పించే మరో ఒప్పందం పైనా రెండు దేశాలూ సంతకాలు చేశాయి.
భయపెడుతున్న మధుమేహం
* ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య 2035 నాటికి 60 కోట్లకు చేరుకుంటుందని 2015 ఫిబ్రవరిలో దోహాలో జరిగిన 'ప్రపంచ ఆరోగ్య వినూత్న ఆవిష్కరణల శిఖరాగ్ర సదస్సు'(విష్) వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2014లో ఆరోగ్య రంగంపై చేసిన ఖర్చులో 11 శాతం కేవలం మధుమేహ సంబంధిత మందుల కోసమే వెచ్చించారు. 2014లో మధుమేహ వ్యాధిగ్రస్థులు తమ మందులపై చేసిన 612 బిలియన్ డాలర్ల ఖర్చు (సుమారు రూ. 36.72 లక్షల కోట్లు) నైజీరియా లేదా స్వీడన్ లాంటి దేశాల మొత్తం స్థూల జాతీయోత్పత్తి కంటే ఎక్కువ. ప్రతి పదిమంది వయోజనుల్లో ఒకరు మధుమేహం బారిన పడతారని సదస్సులో అంచనా వేశారు.
* అంధత్వం, కాలి భాగాలను తొలగించాల్సి రావడం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, గుండెపోటు లాంటివి టైప్-2 మధుమేహ రోగుల్లో ఎక్కువగా సంభవిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్థులు 35 కోట్ల మంది ఉన్నారు.
'హైదరాబాద్ నిధుల' కేసులో భారత్ విజయం
* హైదరాబాద్ నిజాం నవాబు కాలం నాటి నిధులకు సంబంధించిన కేసులో భారత్‌కు అనుకూలంగా బ్రిటన్ కోర్టు 2015 మార్చిలో తీర్పు ఇచ్చింది. పాకిస్థాన్ వైఖరిని తప్పుపట్టింది. భారత్‌కు న్యాయ రుసుముల కింద 1.50 లక్షల పౌండ్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.35 కోట్లు) చెల్లించాల్సిందిగా లండన్‌లోని న్యాయస్థానం పాకిస్థాన్‌కు ఆదేశాలు జారీచేసింది. నిజాం కాలం నాటి డబ్బుకు సంబంధించి 67 ఏళ్లుగా కొనసాగుతున్న కేసులో పాకిస్థాన్ తీరు సహేతుకంగా లేదని నిర్ణయించి ఈ తీర్పునిచ్చింది.
* 'హైదరాబాద్ నిధుల' కేసుగా ఈ వ్యాజ్యం పేరొందింది. వివాదంలో ఉన్న డబ్బు ప్రస్తుత విలువ 3.5 కోట్ల పౌండ్లు. (సుమారు రూ. 315 కోట్లు). ఈ కేసు మూలాలు 1948 నాటివి. హైదరాబాద్ రాజ్య ఏడో నిజాం నవాబుకు ప్రతినిధినని చెబుతూ ఓ వ్యక్తి అప్పట్లో 10.07 లక్షల పౌండ్లను యూకేలోని పాక్ హైకమిషనర్ హబీబ్ రహంతుల్లా పేరిట లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ బ్యాంకు ఖాతాకు మళ్లించారు. 1947లో భారత్, పాకిస్థాన్‌లు సార్వభౌమ దేశాలుగా ఆవిర్భవించాక ఉపఖండంలోని రాజ్యాలు ఈ రెండింటిలో ఏదో ఒకదానిలో చేరడానికి, లేదా స్వతంత్రంగా ఉండటానికి యూకే అనుమతించడంతో స్వతంత్రంగానే ఉండాలని నిజాం నిర్ణయించుకున్నారు. 1948 సెప్టెంబరు 17న హైదరాబాద్‌ను భారతదేశంలో విలీనం చేశారు. అదే ఏడాది సెప్టెంబరు 20న 10.07 లక్షల పౌండ్లు లండన్‌కు బదిలీ అయ్యాయి. తన ఆమోదం లేకుండా జరిగిన ఈ మళ్లింపును రద్దుచేసి, డబ్బును తిరిగి బదిలీ చేయాలని నిజాం కోరారు. ఆ విధంగా చేయలేమంటూ బ్యాంకు నిరాకరించింది. అప్పటి నుంచి అనేక ఏళ్లుగా ఆ నిధి విషయం తేలలేదు. ఇది నిజాం సొంతడబ్బు కాదనీ, అది ప్రభుత్వ ధనమైనందున తమకు ఇవ్వాలనీ భారత ప్రభుత్వం ఇన్నేళ్లుగా వాదిస్తూ వస్తోంది. ఎట్టకేలకు న్యాయస్థానంలో పాక్‌కు ఎదురుదెబ్బ తగలడంతో నిజాం కాలంనాటి నిధిని వెనక్కి తెచ్చుకునేందుకు భారత్‌కు అవకాశం లభించింది.
మూడు దేశాల్లో మోదీ పర్యటన
* 2015 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో పర్యటించారు. సీషెల్స్‌లో భారత్ సహకారంతో ఏర్పాటైన 'తీరప్రాంత నిఘా ప్రాజెక్టు'ను మోదీ ప్రారంభించారు. సముద్ర గస్తీకి ఉపయోగపడే డార్నియర్ విమానాన్ని సీషెల్స్‌కు అందజేస్తామని మోదీ ప్రకటించారు.
* సీషెల్స్ హైడ్రాలజీ నిల్వల సర్వే, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్గ నిర్దేశక పటాల సంయుక్త తయారీ, అమ్మకానికి సంబంధించి ఇరు దేశాలూ నాలుగు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. సీషెల్స్ పత్రిపాదించే 'నీలి ఆర్థిక వ్యవస్థ' (సముద్రం కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు) అంశంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మోదీ వెల్లడించారు.
* మోదీ మారిషస్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 5 ఒప్పందాలు కుదిరాయి. సముద్ర ఆర్థిక రంగంలో పరస్పర సహకారం.. మారిషస్‌లోని అగాలీగా ద్వీపంలో సముద్ర, గగనతల రవాణా సదుపాయాల పెంపుదల.. హోమియోపతితోపాటు సంప్రదాయ వైద్య విధానాల్లో సహకారం.. సాంస్కృతిక రంగంలో ఉమ్మడి కృషి.. భారత్ నుంచి మారిషస్‌కు మామిడి దిగుమతికి సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి.
* 2015 మార్చి 12న మారిషస్ 47వ జాతీయ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాజధాని పోర్ట్‌లూయిస్‌లో మారిషస్ దేశ జాతీయ శాసనసభను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
* శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ 2015 మార్చి 13న శ్రీలంక పార్లమెంటులో ప్రసంగించారు. ఉభయ దేశాల మధ్య ఆర్థిక సంబంధాలకు ఊతం ఇవ్వాలన్న ఆకాంక్షను ప్రతిఫలిస్తూ కస్టమ్స్ సహకార ఒప్పందం కింద పన్నేతర అవరోధాలను తగ్గించడానికి, వాణిజ్య ప్రక్రియను సరళీకరించడానికి ఒక ఒప్పందం కుదిరింది. శ్రీలంక రూపాయి స్థిరత్వం కోసం ఆర్‌బీఐ, శ్రీలంక కేంద్రబ్యాంకు మధ్య ఒప్పందం కుదిరింది.
జపాన్‌లో వృద్ధుల జనాభా
* వరుసగా నాలుగో ఏడాది కూడా జపాన్ జనాభాలో వృద్ధి కనిపించలేదని ఆ ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో ప్రకటించింది. ఏకంగా 15 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి, 2000 ఏడాది జనాభాకు సమం అయింది. దేశంలో నలుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారని జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.
* గతేడాది అక్టోబరుకు జపాన్ జనాభా 0.17 శాతం (2,15,000 మంది) తగ్గి 12,70,83,000 జనాభా వద్ద స్థిరపడినట్లు ఆ ప్రభుత్వం వెల్లడించింది. 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 11 లక్షలు పెరిగి 3,30,00,000కి చేరుకుని, దేశంలో 14 ఏళ్లకంటే తక్కువ వయసున్న వారి సంఖ్యను మించిపోయినట్లు జపాన్ ప్రభుత్వం పేర్కొంది. 2060 కల్లా జపాన్ జనాభా 86.7 శాతానికి పడిపోయి, అందులో 65 ఏళ్లు పైబడిన వ్యక్తులు దాదాపు 40 శాతానికి చేరుకుంటారని ఓ అంచనా.
శ్రీలంక అధ్యక్షుడిగా సిరిసేన
* 2015 జనవరి 8న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మైత్రిపాల సిరిసేన విజయం సాధించి, పదవీ బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడోసారి విజయం సాధించగలనన్న ధీమాతో రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లిన అప్పటి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సే పదేళ్ల పాలనకు ఓటర్లు ముగింపు పలికారు.
* 69 ఏళ్ల రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజాతీర్పు వెలువడటంలో శ్రీలంకలోని మైనార్టీలైన తమిళులు, ముస్లింలు కీలకపాత్ర పోషించారు. వారు మైత్రిపాల సిరిసేనకు అనుకూలంగా పెద్దఎత్తున ఓట్లు వేశారు. 2009లో ఎల్టీటీఈతో జరిగిన యుద్ధం చివరిదశలో తమిళులపై శ్రీలంక సైన్యం దారుణమైన అకృత్యాలకు పాల్పండిదన్న ఆరోపణలు వచ్చాయి. ఎల్టీటీఈని పూర్తిగా అణిచివేసిన తర్వాత తమిళులకు రాజకీయ అధికారాన్ని బదిలీ చేస్తామని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేస్తానని రాజపక్సే హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఆయనపై తమిళుల్లో తీవ్రమైన ఆగ్రహం నెలకొంది. ఎల్టీటీఈ నిర్మూలన తర్వాత శ్రీలంకలో ముస్లింలపై దాడులు మొదలయ్యాయి. దీంతో వారు కూడా రాజపక్సేకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దేశ అధ్యక్ష పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలన్న రాజ్యాంగ నిబంధనను సవరించి మరీ మూడోసారి ఎన్నిక కావడానికి రాజపక్సే చేసిన ప్రయత్నం కూడా వ్యతిరేకతను పెంచింది.
మాదిరి ప్రశ్నలు
1. 2015 జనవరిలో వార్తల్లోకి వచ్చిన వ్యంగ్య రచనల వారపత్రిక 'ఛార్లీ హెబ్డో' ఏ దేశానికి చెందింది?
జ: ఫ్రాన్స్
2. 2014 డిసెంబరు 16న ఏ దేశంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై తాలిబన్ ఉగ్రవాదులు దాడిచేసి 132 విద్యార్థులతో సహా 145 మందిని హతమార్చారు?
జ: పాకిస్థాన్
3. 2015 ఫిబ్రవరిలో ఏ దేశం ప్రపంచంలోనే తొలిసారిగా ముగ్గురి (తల్లీ, తండ్రి, మహిళా దాత) డీఎన్ఏలతో ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానాన్ని పొందడాన్ని చట్టబద్ధం చేసింది?
జ: బ్రిటన్
4. శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన 2015 ఫిబ్రవరిలో తన తొలి విదేశీ పర్యటనలో భాగంగా ఏ దేశాన్ని సందర్శించారు?
జ: ఇండియా
5. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ - 2015లో భారత్ స్థానం?
జ: 136
6. 2015 మార్చిలో 'ఐరాస విపత్తు ప్రమాదాల నివారణ మూడో ప్రపంచ సదస్సు'ను ఎక్కడ నిర్వహించారు?
జ: సెన్‌డాయ్, జపాన్
7. ప్రతిష్ఠాత్మక 'సిల్క్‌రోడ్' రహదారుల ప్రాజెక్టు ఏ దేశానికి చెందింది?
జ: చైనా
8. 'వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్' విడుదల చేసిన 'ఓపెన్ గవర్నమెంట్ ఇండెక్స్-2015'లో భారత్ స్థానం? (వివిధ దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలు, సమాచార హక్కు, పౌరుల భాగస్వామ్యం, ఫిర్యాదు వ్యవస్థలను పరిశీలించి ఈ నివేదికను విడుదల చేశారు. దక్షిణాసియాకు సంబంధించి భారత్ ఈ నివేదికలో తొలిస్థానంలో నిలిచింది.)
జ: 37
9. 2015 చైనా బడ్జెట్‌లో రక్షణ రంగానికి కేటాయించిన మొత్తం?
జ: రూ.9,06,800 కోట్లు
10. 2015 మార్చిలో సీషెల్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశాధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆయన ఎవరు?
జ: జేమ్స్ అలిక్స్ మైఖేల్
Source :- eenadu
#bunny😎

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు