Showing posts with label CARRIER GUIDANCE. Show all posts
Showing posts with label CARRIER GUIDANCE. Show all posts

Sunday, 29 July 2018

HOW TO GET JOB IN RAILWAYS

రైల్వేలో ఉద్యోగం పొందడం ఎలా?



ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలను భర్తీ చేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ రైల్వే. బ్యాంక్ ఉద్యోగాలకు యువతలో ఎంత క్రేజ్ ఉంటుందో రైల్వేలో ఉద్యోగాలకూ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. పోటీ కూడా దీనికి అనుగుణంగానే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమనో, జీతభత్యాలు బాగుంటాయనో, మరే ఇతర కారణాల వల్లనో... రైల్వే ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి స్పందన ఎప్పుడూ ఊహించినదానికంటే ఎక్కువగానే ఉంటుంది. అయితే రైల్వేల్లో ఎన్ని రకాల ఉద్యోగాలుంటాయి, వాటికి అర్హతలేమిటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ప్రవేశ పరీక్షలెలా ఉంటాయి...

రైల్వేలో ఉద్యోగాలు ప్రధానంగా నాలుగు విభాగాలుగా ఉంటాయి. అవి... గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ, గ్రూప్ డీ.

గ్రూప్ ఏ కేటగిరీ ఉద్యోగాలు:ఇవి యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) నిర్వహించే సివిల్స్ పరీక్షల ద్వారా భర్తీ అవుతాయి. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్... ఈ రెండింటికీ అర్హతలు సివిల్స్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించినవే. మరొకటి ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్. దీనికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే అర్హులు. ఇంకొకటి ఇండియన్ మెడికల్ సర్వీసెస్. ఈ నాలుగు కేటగిరీల ఉద్యోగాల భర్తీని యూపీఎస్సీ నిర్వహిస్తుంది.

గ్రూప్ బీ... ఇవి పూర్తిగా డిపార్ట్‌మెంటల్ ఉద్యోగాలు. అంటే... గ్రూప్ సీలో పనిచేసేవాళ్లు తగినంత అనుభవం పొందిన తర్వాత డిపార్ట్‌మెంటల్ టెస్టులు రాసి ఉత్తీర్ణులైతే గ్రూప్ బీ కేటగిరీకి పదోన్నతి పొందవచ్చు.

గ్రూప్ సీ... స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్, క్లర్క్, కమర్షియల్ అప్రెంటీస్, సేఫ్టీ స్టాఫ్, ట్రాఫిక్ అప్రెంటీస్, ఇంకొన్ని ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఈ కేటగిరీలో ఉంటాయి. ఈ ఉద్యోగాలకు డిమాండ్ చాలా ఎక్కువ. ఈ సంవత్సరం 26000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు 2.6 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఉద్యోగాలకున్న డిమాండ్ ఎలాంటిదో.

వీటికి కనీస విద్యార్హత పదో తరగతితోపాటు ఐటీఐ ఉత్తీర్ణత. 18 నుంచి 32 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. వీటితోపాటు సాధారణ రిజర్వేషన్లన్నీ వర్తిస్తాయి.

గ్రూప్ డీ ఉద్యోగాలు: ఇవి ప్రాథమిక స్థాయి లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు అని చెప్పవచ్చు. ట్రాక్ మెన్, హెల్పర్, పాయింట్స్ మెన్, సఫాయివాలా, ప్యూన్... ఇలా ప్రతి రైల్వే స్టేషన్లోనూ అవసరమైన సాధారణ సిబ్బంది అందరూ గ్రూప్ డీ కిందికి వస్తారు. దీనికి కనీస అర్హత పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.

ఈ విభాగంలో ప్రతి సంవత్సరం దాదాపు 62000 ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ప్రత్యేకించి ఓ సమయమంటూ ఏమీ ఉండదు. రైల్వే శాఖ ఎప్పుడు ఖాళీలు భర్తీ చేయాలనుకుంటే అప్పుడు ప్రకటన విడుదల చేస్తుంది.

Tuesday, 24 July 2018

DUTIES OF PANCHAYAT SECRETARY

కార్యదర్శి ముఖ్య విధులు ఇలా ఉంటాయి 


* పంచాయతీ తీర్మానాలను కార్యదర్శి అమలు చేయాలి. గ్రామంలో రోజూ ఉదయాన్నే పర్యటిస్తూ పారిశుద్ధ్య సిబ్బంది హాజరును తీసుకొని వారికి పనులు చూపించాలి. మురుగు కాలువల్లోని పూడికను తీయించాలి. చెత్తను తడి,పొడిగా డంపింగ్‌ యార్డుల వరకు తరలించేలా.. వీధిదీపాలు 90 శాతం వెలిగేలా చూడాలి. తాగునీటి సరఫరాకు భగీరథ అధికారులకు సహకరించాలి. అతను పంచాయతీకి అధీనుడు (సబార్డినేట్‌)గా ఉంటారు.

* కార్యదర్శి కొత్త పన్నులను ప్రతిపాదించవచ్చు. విధుల్లో విఫలమైన కార్యదర్శి తన ఉద్యోగాన్ని కోల్పోక తప్పదు. గ్రామంలో మొక్కలను నాటడం, వాటిలో కనీసం 85 శాతం బతికేలా చర్యలు చేపట్టి వివరాల నమోదుకు రిజిస్టర్‌ను నిర్వహించాలి. ప్రతి రాబడి, ఖర్చును లెక్కల పుస్తకంలో నమోదు చేయాలి. సర్పంచి పర్యవేక్షణ, నియంత్రణ కింద పంచాయతీ సిబ్బందిపై పాలనాపరమైన, వారికి జీతాల చెల్లింపు అధికారాలు కార్యదర్శికి ఉంటాయి.

* కార్యదర్శి తాను నిర్వర్తించిన పనులపై ప్రతినెలా నివేదికలను బహిర్గతపరచాలి. ఇందులో తప్పిదాలు బయటపడితే క్రమశిక్షణ చర్యలు తప్పవు. పంచాయతీ అనుమతించే ఏదైనా అనుమతి లేదా ఉత్తర్వును మరుసటిరోజే కార్యదర్శి జారీ చేయాలి. సర్కారు ఎప్పటికప్పుడు ఇచ్చే ఉత్తర్వులను అమలు చేస్తుండాలి. కార్యదర్శులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవచ్చు.

Friday, 29 June 2018

HOW TO QUALIFY FOR GROUP 4 & VRO

గ్రూప్-4, వీఆర్‌వో...విజయానికి మార్గాలు

ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ, దైనందిన ప్రజా జీవితంలో వారి సమస్యలు పరిష్కరించే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్‌వో), ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేసే గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకంగా ఉండే క్షేత్రస్థాయి ఉద్యోగాలకు ప్రకటనలు రావడంతో ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్‌లో లీనమయ్యారు. 1521 గ్రూప్ 4,700 వీఆర్‌వో ఉద్యోగాల ప్రకటనలను పరిశీలిస్తే.. ఒకే సబ్జెక్టులు, దాదాపుగా ఒకే సిలబస్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏకకాలంలో రెండు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం లభించింది.

ఎలాంటి ఇంటర్వ్యూలు లేని నియామక ప్రక్రియ కావడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. దీంతో ఈ పరీక్షల్లో నెగ్గుకురావడం సవాలే. గ్రూప్ 4 పరీక్షను అక్టోబర్ 7న, వీఆర్‌వో పరీక్షను సెప్టెంబర్ 16న నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్ధమవుతోంది. అందువల్ల అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవడం ద్వారా విజయం సాధించొచ్చు.

గ్రూప్-4 పరీక్ష విధానం :


సిలబస్..
జీకే: కరెంట్ అఫైర్స్; అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు; నిత్యజీవితంలో జనరల్‌సైన్స్; పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ; తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ; భారత రాజ్యాంగం; భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం; ఆధునిక భారతదేశ చరిత్ర; తెలంగాణ చరిత్ర, ఉద్యమం; తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు.

సెక్రటేరియల్ ఎబిలిటీస్: మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్); లాజికల్ రీజనింగ్; కాంప్రెహెన్షన్; రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్; న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్.

వీఆర్‌వో పరీక్ష విధానం (వ్యవధి: 150 ని.) :



సిలబస్ :
జీకే: గ్రూప్ 4 సిలబస్‌లోని అంశాలే ఇందులోనూ ఉన్నాయి. అదనంగా ఎథిక్స్, బలహీన వర్గాలు, లింగ అసమానతలు, సామాజిక స్పృహ అంశాలను పొందుపరిచారు.

సెక్రటేరియల్ ఎబిలిటీస్: బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి); మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్); లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్.

ప్రిపరేషన్ టిప్స్..
చాలా కాలంగా ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వీఆర్‌వో, గ్రూప్ 4 ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్షల కాఠిన్యత ఎక్కువగా ఉండొచ్చని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు.

అర్థమెటిక్/న్యూమరికల్ ఎబిలిటీ :
నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు అర్థమెటిక్/న్యూమరికల్ సెక్షన్‌ను క్లిష్టంగా భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఈ సెక్షన్‌లోనూ వారు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
తొలుత ప్రతి చాప్టర్‌లో ఉన్న బేసిక్స్ నేర్చుకోవాలి. సూత్రం ఆధారంగా సమాధానాలు రాబట్టే సమస్యలతో పాటు కేవలం నోటి లెక్కలతో చేయగలిగేవి కూడా ఉంటాయి. వీటికి వేగంగా, కచ్చితంగా సమాధానాలు గుర్తించొచ్చు. మరికొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల ద్వారా సరైన సమాధానాన్ని గుర్తించేందుకు వీలుంటుంది.
భాజనీయత సూత్రాలు, సరాసరి, కాలం-పని, ఎత్తులు-దూరాలు, లాభనష్టాలు, వడ్డీ, శాతాలు, క్షేత్రమితి, వైశాల్యం తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మెరుగైన మార్కుల సాధనకు ఇదొక్కటే సరైన మార్గమని గుర్తించాలి. సమస్యను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. సందర్భానుసారం సూత్రాలను ఉపయోగించే విధంగా అవగాహన పెంచుకోవాలి.
ఆరు నుంచి పదో తరగతి వరకు గణిత శాస్త్ర అంశాలపై పట్టు సాధించడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆర్‌ఎస్ అగర్వాల్, రాజేశ్ వర్మ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ తదితర పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవచ్చు.

లాజికల్ రీజనింగ్ :
ఇందులో కోడింగ్/డీకోడింగ్, సంఖ్యా శ్రేణులు, అక్షర శ్రేణులు, ర్యాంకులు, సీటింగ్ అరెంజ్‌మెంట్, రిలేషన్స్, పదాల సారూప్యత, దిశ నిర్ధారణ, గడియారాలు, క్యాలెండర్, నాన్-వెర్బల్ రీజనింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించాలంటే విషయ సంగ్రహణ, సామర్థ్యం, తర్కబద్ధంగా ఆలోచించడం తదితర నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలను నిరంతరం సాధన చేస్తుండాలి. నిర్దేశించిన సిలబస్ కాకుండా సాధారణ పరిజ్ఞానంపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వృత్తం అనేది వృత్తపరిధికి సంబంధించింది అయితే చతురస్రం అనేది దేనికి సంబంధించింది? (సమాధానం: చుట్టుకొలత).
వీఆర్‌వో, గ్రూప్ 4 పరీక్షల్లో ఇంగ్లిష్ నుంచి దాదాపు 15 చొప్పున ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. గ్రూప్ 4లో ఈ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. ఇంగ్లిష్‌లో కాంప్రెహెన్షన్, రీ అరేంజ్‌మెంట్‌పై ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు బేసిక్ గ్రామర్ రూల్స్, వొకాబ్యులరీని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్ :
సిలబస్ చూసి గాబరా పడకుండా కరెంట్ అఫైర్స్‌తో అధ్యయనం ప్రారంభించాలి. ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, జనాభా, పేదరికం, పారిశ్రామిక రంగం, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవాలి.
చరిత్రలో ప్రశ్నలు విషయ ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సార్లు పునశ్చరణ చేసుకోవడం మంచిది. హైస్కూల్ స్థాయి వరకు ఉన్న అంశాలను చదవడం తప్పనిసరి. జాతీయోద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. భూగోళశాస్త్రంలో గ్రామీణ నేపథ్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, స్థానిక ప్రత్యేకతలు, సాగు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
అర్థశాస్త్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ దృష్టి, దానికి సంబంధించిన ముఖ్య గణాంకాలు గుర్తుంచుకోవాలి. ఆర్థిక సర్వే, తెలంగాణ అధికారిక మాస పత్రికను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రారంభించిన సంవత్సరాలు, లక్ష్యాలు, ప్రాతిపదికలు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనలు, కరపత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
పౌరశాస్త్రానికి సంబంధించి అధిక శాతం ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థపై వస్తున్నాయి. ఈ క్రమంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, నిర్మాణం, విధులు; 73, 74వ రాజ్యాంగ సవరణలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఈ-గవర్నెన్స్, రెవెన్యూ పరిపాలన, వివిధ స్థాయిల్లోని అధికారులు-అధికారాలు-విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలి.
జీవశాస్త్రంలో విజ్ఞానశాస్త్ర చరిత్ర, విటమిన్లు, సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు, మానవ శరీరం-ఆరోగ్యం, పశు సంవర్ధనం, జీవన విధానాలు, పోషణ, నియంత్రణ, సమన్వయం, జీవశాస్త్రంపై పరిశోధనలు జరిపే సంస్థలు, అవి ఉన్న ప్రదేశాలు, కొత్తగా ఆవిష్కరించిన ముఖ్య ఔషధాలు, వైరస్‌లు వాటి నేపథ్యం తెలుసుకోవాలి.
భౌతిక-రసాయన శాస్త్రంలో ప్రశ్నలు ఎక్కువగా అనువర్తిత విధానంలో ఉంటాయి. నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, సమకాలీన ఆవిష్కరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
తెలంగాణకు సంబంధించి ప్రాచీన, ఉద్యమ చరిత్రలను లోతుగా అధ్యయనం చేయాలి. ఉద్యమ చరిత్రలో 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు-వాటి సిఫార్సులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టిసారించాలి.
చరిత్రకు సంబంధించి రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయమున్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. భౌగోళికంగా తెలంగాణలోని ముఖ్య నదులు- పరీవాహక ప్రాంతాలు; ముఖ్య పంటలు; భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టిసారించాలి.
తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా తదితర అంశాలపై అవగాహన అవసరం. గ్రామీణాభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. వీటిలో సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, పేదరికం, పారిశ్రామిక రంగం, సాగునీటి పారుదల తదితర అంశాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.
వీఆర్‌వో పరీక్షలో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరీక్షించేలా కూడా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఎథిక్స్, స్త్రీ-పురుష సమానత్వం, బలహీన వర్గాలు, సామాజిక స్పృహ తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.

Wednesday, 27 June 2018

HOW TO BECOME AIR HOSTESS

ఎయిర్ హోస్టెస్ కావాలంటే కావాల్సిన అర్హతలివే


విమానాల్లో ప్రయాణించడం అనేది ఒకప్పుడు చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఆ రంగంలో పోటీ పెరగడంతో ఇప్పుడిది సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చింది.
దీనికి తోడు కొత్త విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతున్నాయి.
విమాన ప్రయాణమే ఓ అద్భుతం అనుకుంటుంటే... విమానంలో ఉద్యోగం అంటే! ఇది ఇంకా అద్భుతం. చాలామందికి దీనిపై ఆసక్తి ఉంటుంది.

విమానం అనగానే ముందుగా చాలామందికి గుర్తొచ్చేది ఎయిర్ హోస్టెస్. అందమైన రూపంతో, చక్కటి మాటతీరుతో ప్రయాణికులకు విమానప్రయాణంలో ఎదురయ్యే అవసరాలన్నింటినీ తీర్చే సహాయకారి.

మరి ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ (సిబ్బంది) కావడం ఎలా?

విమానయాన రంగంలో ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, పూర్తి చేయాల్సిన శిక్షణకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చాలా స్పష్టమైన నిబంధనలు రూపొందించింది.
మనం విమానంలోకి ప్రవేశించగానే మనకు ఎదురయ్యేది క్యాబిన్ క్రూ. వీరి పని కేవలం ప్రయాణికులను సాదరంగా ఆహ్వానించడం మాత్రమే కాదు, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రయాణికులను బయటకు వీలైనంత సురక్షితంగా ఎలా పంపించాలి, వైద్య సహాయం అవసరమైతే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి.. ఇలాంటి ఎన్నో అంశాలపై వీరికి శిక్షణ అవసరం.

క్యాబిన్ క్రూ కావాలంటే అర్హతలేమిటి?

10+2 ఉత్తీర్ణులు అర్హులు. ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే మాటతీరు, మీరు చెప్పదలచుకున్న అంశాల్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నారా లేదా, ఇంగ్లిష్ భాషలో మాట్లాడగలిగే సామర్థ్యం... ఇవీ ప్రధానంగా కావాల్సిన అంశాలు. మీకు ఏదైనా విదేశీ భాష వచ్చి ఉంటే అది మీకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. వీటితోపాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా, నిర్దేశిత ఎత్తుకు తగిన బరువు, నాణ్యమైన కంటి చూపు కలిగి ఉండాలి.
వీటితో పాటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాల ప్రయాణికులతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి.. భారత్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేయాలంటే ఇంగ్లిష్, హిందీ... ఈ రెండు భాషలూ వచ్చి ఉండాలి.
మరో ముఖ్యమైన అంశం... పాస్‌పోర్ట్. మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత విధుల్లో భాగంగా విదేశీ విమాన సర్వీసుల్లో కూడా ప్రయాణించాల్సి రావచ్చు. అందువల్ల పాస్‌పోర్ట్ కలిగిఉండటం తప్పనిసరి.

శిక్షణ ఎలా ఉంటుంది?

సాధారణంగా విమానయాన సంస్థలన్నీ వేటికవే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. వారు నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైనవారు సుమారు రూ.50000 వరకు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తికాగానే తమ సంస్థల్లోనే వీరికి అవకాశాలు కల్పిస్తారు.
శిక్షణలో భాగంగా... విమానం పనితీరు, ప్రయాణం జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు-చర్యలు... ఇలాంటి అంశాలన్నీ వివరిస్తారు. వీటితోపాటు ఫ్లయింగ్ అవర్స్ కల్పిస్తారు. ప్రతి సంవత్సరం నిర్దేశిత ఫ్లయింగ్ అవర్స్ ఉండటం డీజీసీఏ నిబంధనల ప్రకారం తప్పనిసరి.
పైలట్ ఏదైనా అనారోగ్యం పాలైనా, సిబ్బంది మధ్య సమస్యలు, ప్రయాణికులతో సమస్యలు, ప్రయాణికుల మధ్య సమస్యలు... ఇలాంటి పరిణామాల్లో ఎలా పనిచేయాలో కూడా క్యాబిన్ క్రూ లేదా ఎయిర్ హోస్టెస్‌లకు తెలిసి ఉండాలి. అవసరమైతే విమానాన్ని నడపగలిగే సామర్థ్యం కూడా వీరికి ఉండాలి. దీనిపై కూడా శిక్షణ అవసరం.
ఇవి కాకుండా ప్రైవేటు ట్రైనింగ్ స్కూళ్లు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో శిక్షణ తీసుకుంటే ఉద్యోగం కోసం మళ్లీ ప్రయత్నించాల్సిందే. ఇది కొద్దిగా కష్టమైన పని. పైగా వీరి శిక్షణలో ఫ్లయింగ్ అవర్స్ ఉండకపోవచ్చు.
ఒక్కసారి సెలక్ట్ అయితే... క్యాబిన్ క్రూగా కొద్ది రోజులు చేశాక, కావాలనుకుంటే ఎయిర్‌పోర్టుల్లో ఉండే ఉద్యోగాలకు మారే అవకాశం కూడా ఉంటుంది.

HOW TO BECOME SCIENTIST IN ISRO

ఇస్రోలో సైంటిస్ట్ కావాలంటే ఇదే మార్గం

ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం ఎలా?Image copyright

ప్రతిష్ఠాత్మక సంస్థ ఇస్రో (ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)లో ఉద్యోగావకాశాల గురించి తెలుసుకుందాం.

అంతరిక్ష పరిశోధనలు, రాకెట్ - ఉపగ్రహ ప్రయోగాల కారణంగా ఇస్రో అంటే తెలియనివారు సాధారణంగా ఉండరు. పీఎస్‌ఎల్‌వీ, జీఎస్ఎల్‌వీ రాకెట్లతో ఎన్నో ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సొంతం.

ఇస్రోలో నియామకాలు ఎలా జరుగుతాయి?

ఇస్రోలో నియామకాలన్నీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్, ఇస్రో కలిసి ఏర్పాటు చేసుకున్న సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (సీఆర్‌బీ) ఆఫ్ ఇస్రో పర్యవేక్షణలో జరుగుతాయి. దీనికి సంబంధించిన వెబ్‌సైట్లో నియామకాలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలన్నీ ఉంటాయి.
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్, సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్... వంటి 23 నగరాల్లోని 32 కేంద్రాలతో పాటు ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మేఘాలయలోని నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ), బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), తిరుపతిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రిసెర్చ్ ల్యాబొరేటరీ, మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ వంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలన్నింటికీ సీఆర్‌బీనే నియామకాలు నిర్వహిస్తుంది.
సెమీకండక్టర్ ల్యాబొరేటరీ ద్వారా ఇస్రోలో చేరాలంటే పీహెచ్‌డీ ఉన్నవాళ్లు నేరుగా దరఖాస్తు చేయవచ్చు.
Image copyright

ఏ విభాగాల అభ్యర్థులకు ప్రాధాన్యం?

ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్, ఆర్కిటెక్చర్... ఈ విభాగాల్లో ఇంజనీరింగ్ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇస్రో జారీ చేసే సైంటిస్ట్ ఉద్యోగ ప్రకటనల్లో ఈ అర్హతలకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి. దూరవిద్యలో ఇంజనీరింగ్ చేస్తే ఈ సంస్థల్లో ప్రవేశానికి అనర్హులు. ఏఎంఐఈ పూర్తి చేసిన అభ్యర్థులు ప్రకటనలో అర్హతలకు సంబంధించిన వివరాలను చెక్ చేసుకోవాలి.
మీ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 65% లేదా సీజీపీఏ 6.84 స్కోరు వస్తేనే ఇస్రోలో ఈ ఉద్యోగాలకు అర్హులు. దీనికి ఎలాంటి సడలింపూ ఉండదు.
ఎంఈ, ఎంటెక్... వంటి పీజీ కోర్సులు పూర్తి చేసినా ఇస్రో మాత్రం బీఈ, బీటెక్‌లలో వచ్చిన మార్కులనే ఈ ఉద్యోగాలకు పరిగణనలోకి తీసుకుంటారు.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసినవారు బార్క్‌లో ఉద్యోగాలకు అనర్హులు కానీ ఇస్రో ఉద్యోగాలకు మాత్రం వీరు అర్హులే. ఈ స్పెషలైజేషన్‌తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
Image copyright

సాధారణ అర్హతలేంటి?

  • భారత పౌరులై ఉండాలి.
  • 35 ఏళ్ల లోపు వయసు కలిగినవారై ఉండాలి. ఎక్స్-సర్వీస్‌మెన్, వికలాంగులకు కొంత సడలింపు ఉంటుంది.
  • నేషనల్ కెరియర్ సర్వీసెస్‌లో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాతే ఇస్రో ఉద్యోగానికి దరఖాస్తు చేయాలి.
  • రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఇప్పటికే రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవాళ్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) కూడా జతచేయాలి. దరఖాస్తు చేసిన వారం రోజుల్లోపు ఇది ఇస్రో సూచించిన చిరునామాకు దీన్ని పంపించాలి.
Image copyright

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

  • రాత పరీక్ష
  • మీరు ఎంచుకున్న విభాగంలో 80 ప్రశ్నలుంటాయి.
  • దేశంలోని 12 నగరాల్లో పరీక్ష జరుగుతుంది.
  • ఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ పిలుపు వస్తుంది.
  • ఇంటర్వ్యూలో కనీసం 60 శాతం రావాల్సి ఉంటుంది.
  • చివరిగా... మెరిట్ లిస్ట్ ఆధారంగా నియామకాలు చేస్తారు. ఈ ఉద్యోగాన్ని సైంటిస్ట్ ఇంజనీర్ (ఎస్ఈ) అంటారు.
  • ప్రారంభంలోనే రూ.56,100/- బేసిక్‌తో మీ స్కేల్ ఫిక్స్ అవుతుంది. దీనికి అలవెన్సులు అదనం.

HOW TO GET BANK JOBS LIKE SBI-IBPS

బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకు కంప్లీట్ గైడ్

ఎన్ని రకాల ఉద్యోగాలున్నా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. ఉద్యోగ భద్రత కావచ్చు, మంచి జీతభత్యాలు కావచ్చు, మంచి భవిష్యత్ కావచ్చు... ఇలా కారణాలు ఏవైనా ఇతర ఉద్యోగాల కన్నా వీటిపై యువతకు మోజు ఎక్కువగానే ఉంటుంది. అందుకే వందల సంఖ్యలో ఖాళీలు అని ప్రకటన వెలువడినా లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. రైల్వే ఉద్యోగాలతో పోలిస్తే బ్యాంకు ఉద్యోగాలకు డిమాండ్ మరింత ఎక్కువ. అయితే, అసలు బ్యాంకింగ్ రంగంలో ఏయే ఉద్యోగాలున్నాయి, వాటికి ఏ పరీక్షలు రాయాలి, ఎవరు ఈ పరీక్షలు నిర్వహిస్తారు, ఎలా సిద్ధం కావాలి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది...

బ్యాంకు ఉద్యోగం సాధించడం ఎలా?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తాయి. సుమారు 20 ప్రభుత్వరంగ బ్యాంకులు ఐబీపీఎస్ స్కోరు ఆధారంగానే వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలకు నియామకాలు చేపడతాయి. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం క్లరికల్, ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది.

ఎస్‌బీఐలో ఏయే ఉద్యోగాలుంటాయి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం సుమారు 8000 క్లరికల్ అసిస్టెంట్ (జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్), ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేస్తుంది. ఇది సాధారణంగా ఏప్రిల్, మేలలో ఉంటుంది. జూన్‌లో ప్రాథమిక పరీక్ష, జులై/ఆగస్ట్‌లో మెయిన్స్ పరీక్ష ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

సాధారణ అర్హతలేమిటి?

నిర్థారిత తేదీ నాటికి అభ్యర్థి వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు దీనికి అర్హులు.

పరీక్ష ఎలా ఉంటుంది?

ప్రిలిమినరీ పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిని గంటలో పూర్తి చేయాలి. పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీనిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

మెయిన్స్‌లో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిని రెండు గంటల్లోపు పూర్తి చేయాలి. దీనిలో కూడా ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. ఇంటర్వ్యూలో మీ ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)
20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని వివిధ స్థాయిల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది. సుమారు 4000 పీవో పోస్టుల భర్తీకి ప్రతి సంవత్సరం ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష సాధారణంగా అక్టోబరులోను, మెయిన్స్ నవంబరులోనూ నిర్వహిస్తారు.

ఐబీపీఎస్ పీవో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 5, 2018. అర్హులైనవారు ప్రిలిమినరీ పరీక్షకు సెప్టెంబరు నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మొదట ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాలి, తర్వాత మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

అలాగే ప్రతి సంవత్సరం సుమారు 8000 క్లరికల్ పోస్టుల భర్తీ ఐబీపీఎస్ ద్వారా జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఈ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రిలిమినరీ పరీక్ష ఎస్‌బీఐ మాదిరిగానే ఉంటుంది. కానీ మెయిన్స్ మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీనిలో 200 మార్కులకు 190 ప్రశ్నలుంటాయి. వీటిని పూర్తి చేయడానికి ఇచ్చే సమయం 160 నిమిషాలు.

ఐబీపీఎస్ - రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్ఆర్‌బీ)
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బ్యాంకులకోసం ప్రత్యేక ఆఫీసర్ల నియామకాలకోసం ఉద్దేశించిన పరీక్ష ఇది.

దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.

క్లరికల్ పోస్టులకోసం ఇంటర్వ్యూ ఉండదు. మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది.

కానీ ఆఫీసర్ కేడర్ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీని ద్వారానే తుది ఎంపిక జరుగుతుంది.

ఈ పరీక్షకు కూడా ప్రస్తుతం దరఖాస్తు అందుబాటులో ఉంది. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబరులో మెయిన్స్ జరుగుతుంది.

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ - జూనియర్ మేనేజ్‌మెంట్
ఐటీ, అగ్రికల్చర్, రాజ్ భాష అధికారి, లా, హెచ్ఆర్, మార్కెటింగ్.. విభాగాలకు నిర్వహించే పరీక్ష ఇది. సుమారు 1400 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ అవుతాయి. వీటికి కూడా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

పరీక్షల్లో ఏయే అంశాలుంటాయి?
ప్రిలిమ్స్‌

న్యూమరికల్ ఎబిలిటీ
రీజనింగ్ ఎబిలిటీ
ఇంగ్లిష్ లాంగ్వేజ్
మెయిన్స్‌

జనరల్ ఫైనాన్స్ ఎవేర్‌నెస్
జనరల్ ఇంగ్లిష్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
ఈ అంశాలను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ప్రాక్టీస్ చేస్తే బ్యాంక్ ఉద్యోగం సంపాదించడం కష్టమైన పనేం కాదు




#SOURCE BBC_TELUGU

HOW TO GET TELANGANA POLICE JOB

ఖాకీ కొలువులు కొట్టాలంటే..!

పోలీసుశాఖలో ఉద్యోగాలంటే యువతలో ఎంతో ఆకర్షణ ఉంటుంది. తెలంగాణ పోలీసు నియామక మండలి తాజా నోటిఫికేషన్‌తో ఆ కొలువుల సంబురం మొదలైంది. ఈ పోస్టులపై ఆసక్తి ఉన్నవారు ఈ భారీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎస్‌ఐ, కానిస్టేబుళ్ళ కొలువులకు గురిపెట్టి.. శారీరక సామర్థ్య పరీక్షలకూ, రాతపరీక్షలకూ తగిన విధంగా సిద్ధమవ్వాల్సిన తరుణమిది!

తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖల్లోని 16,925 కానిస్టేబుల్‌, 1272 సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సివిల్‌, ఏఆర్‌, ఫైర్‌ స్టేషన్‌, జైలర్‌, రిజర్వ్‌ పోలీస్‌ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులనుబట్టి కనీస వయసు నిర్ణయించారు. బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీవారికి వయఃపరిమితిలో అయిదేళ్ల సడలింపు ఉంది. దరఖాస్తు, నోటిఫికేషన్‌ పూర్తి వివరాలకు ‌www.tslprb.in ను చూడొచ్చు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటిది ప్రిలిమినరీ రాతపరీక్ష. దీనిలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. 3 గంటల వ్యవధి. కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు.

ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో 100 ప్రశ్నలు జనరల్‌స్టడీస్‌ నుంచీ, 100 ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌ల నుంచీ ఉంటాయి. కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లిష్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ స్టడీస్‌ అన్నింటి నుంచీ కలిపి 200 ప్రశ్నలు వస్తాయి. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫయింగ్‌ మాత్రమే. క్వాలిఫై అయినవారికి దేహదార్ఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అర్హులైన అభ్యర్థులకు మార్కులు కేటాయించి, తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో వచ్చే మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు.

కానిస్టేబుల్‌ తుది రాతపరీక్షలో 200 ప్రశ్నలుంటాయి. 200 మార్కులు. సమయం- 3 గంటలు. ప్రిలిమినరీలో వచ్చిన అంశాల నుంచే ఫైనల్‌ రాతపరీక్షలోనూ వస్తాయి.

సబ్‌ఇన్‌స్పెక్టర్‌ తుది రాతపరీక్షలో నాలుగు పేపర్లుంటాయి. మొదటి రెండు పేపర్లు ఇంగ్లిష్‌, తెలుగు/ఉర్దూ ఉంటాయి. ఇవి కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్షలే. తెలుగు పరీక్షను ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొదటిసారి నిర్వహిస్తున్నారు. ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన రెండు పేపర్లు అరిథ్‌మెటిక్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌స్టడీస్‌, చివరి రెండు పేపర్లు, దేహదార్ఢ్య పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయిస్తారు. రాతపరీక్షలో రుణాత్మక మార్కులున్నాయి. తెలిసిన ప్రశ్నలనే ఎంచుకోవాలి.

ఏ సబ్జెక్టులు ఎలా సిద్ధం కావాలి?
ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాతపరీక్షల్లో ఇంగ్లిష్‌, అరిథ్‌మెటిక్‌, రీజనింగ్‌, జనరల్‌ సైన్స్‌, జనరల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.

అరిథ్‌మెటిక్‌: వ్యాపార గణిత అంశాలైన శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ, కాలం-పని, కాలం-దూరం, వ్యాపార భాగస్వామ్యం, వైశాల్యాలు, చుట్టుకొలత, ఘనపరిమాణం, కసాగు, గసాభా వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని గ్రూపులుగా విభజించి సన్నద్ధమైతే చాలా సులభంగా నేర్చుకోవచ్చు. శాతాలు, నిష్పత్తి, లాభనష్టాలు, చక్రవడ్డీ, బారువడ్డీ ప్రశ్నలు ఒకే కోవకు చెందినవి. పదసరళిలో మాత్రమే మార్పు ఉంటుంది. శాతాలను క్షుణ్ణంగా నేర్చుకుంటే మిగిలిన అంశాలన్నీ సులభంగా ఉంటాయి. శాతాల్లో ఉన్న విలువను భిన్నాలుగా రాస్తే దాన్ని నిష్పత్తిగా గుర్తించవచ్చు.

కసాగు అంశాన్ని కాలం-పని, పైపులు-తొట్టెల్లో ఉపయోగిస్తాం. కాలం-దూరంలోని పదసరళిని మార్చి గమనిస్తే.. రైళ్లు, పడవలు-ప్రవాహాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈ మూడు చాప్టర్లను అనుసంధానిస్తూ సన్నద్ధత కొనసాగించాలి. వైశాల్యాలు, ఘనపరిమాణాల ఫార్ములాలను పట్టిక రూపంలో రాసుకుని చదవాలి. ఫార్ములాల్లో ‘పై’ ఉన్నచోట సమాధానం 11తో భాగించేలా ఉంటుంది. ఇలాంటి టెక్నిక్‌లను వాడుతూ తక్కువ సమయంలో సమాధానాన్ని గుర్తించేలా సిద్ధమవ్వాలి.

డేటా అనాలిసిస్‌, డేటా సఫిషియన్సీ నుంచి 5 ప్రశ్నలు ఒకే పట్టిక/ వెన్‌చిత్రాలు, బార్‌చార్ట్‌, గ్రాఫ్‌లపై వస్తాయి. ఇచ్చిన, అందుబాటులో ఉన్న సమాచారం నుంచి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఈ క్రమంలో శాతాలు, నిష్పత్తి, సరాసరి అంశాలను ఉపయోగించాలి. సింప్లిఫికేషన్‌ తక్కువ సమయంలో పూర్తిచేసేలా షార్ట్‌కట్స్‌, మైండ్‌ కాలిక్యులేషన్స్‌ వాడాలి.

మేథమేటిక్స్‌ అంశాల్లో మాత్రికలు, త్రికోణమితి, ఎత్తు-దూరం, సర్డ్స్‌, ఇండిసెస్‌, ఆల్జీబ్రా అంశాలు చూసుకోవాలి. గత రెండేళ్లలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వనప్పటికీ అంతకుముందు పరీక్షల్లో 50 వరకూ ప్రశ్నలు మేథమేటిక్స్‌ అంశాల నుంచి వచ్చాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.

రీజనింగ్‌: దీనిలోని ప్రశ్నలన్నీ లాజిక్‌తో ముడిపడి ఉంటాయి. సృజనాత్మకతను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో పోలీసులు తార్కికంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక లాజిక్‌ ఆధారంగా సమాధానం గుర్తించలేని సమయంలో లాజిక్‌ను మార్చి ప్రయత్నించాల్సి ఉంటుంది. నంబర్లు, లెటర్ల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్‌ రీజనింగ్‌గా పరిగణిస్తారు. నంబర్‌ సిరీస్‌, లెటర్‌ సిరీస్‌, అనాలజీ, కోడింగ్‌-డీకోడింగ్‌, ఆడ్‌మాన్‌ అవుట్‌ అంశాలు ఈ కోవకు చెందుతాయి. సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌, రక్తసంబంధాలు, దిక్కులు, పజిల్స్‌ అనలిటికల్‌ రీజనింగ్‌ కిందకి వస్తాయి. అందుబాటులో ఉన్న పూర్తి సమాచారాన్ని వాడుతూ పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్‌ పూర్తిచేయాలి.

గడియారాలు, క్యాలెండర్‌, క్యూబ్స్‌, డైస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. గడియారాల్లో చిన్నముల్లు, పెద్దముల్లు గంట వ్యవధిలో ఎన్నిసార్లు 90, 180, 0 డిగ్రీల కోణాలను చూపిస్తాయో గుర్తించాలి. అదేవిధంగా సమయం ఇచ్చినపుడు గంటలు, నిమిషాల ముల్లుల మధ్య ఉండే కోణాన్ని డిగ్రీల్లో కనుక్కోగలగాలి. క్యాలెండర్ల నుంచి వచ్చే ప్రశ్నల్లో తేదీ ఆధారంగా వారంలో ఏరోజు అవుతుందో చెప్పగలగాలి.

బొమ్మల ఆధారంగా ప్రశ్నలు ఇస్తే వాటిని నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌గా పరిగణిస్తాం. సిరీస్‌ ప్రశ్నల్లో బొమ్మల మధ్య ఉండే సంబంధాన్ని బట్టి అదే లాజిక్‌ వాడుతూ సమాధానం గుర్తించాలి. సిలాజిజం, అసంప్షన్స్‌, ఇన్ఫరెన్సెస్‌, కోర్సెస్‌ ఆఫ్‌ యాక్షన్‌, ఆర్గ్యుమెంట్స్‌, కన్‌క్లూజన్స్‌, కాజ్‌-ఎఫెక్ట్‌, అసర్షన్‌-రీజన్‌, డెసిషన్‌ మేకింగ్‌.. హైలెవల్‌ రీజనింగ్‌ అంశాలు. ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే భాష మీద పట్టుండాలి. హైలెవల్‌ రీజనింగ్‌ ఉద్యోగ నిర్వహణలో తీసుకునే నిర్ణయాలకు కూడా ఉపయోగపడుతుంది.

ఇంగ్లిష్‌: పోలీసుశాఖ ఉద్యోగులు వృత్తిరీత్యా పై అధికారులకు సమాచారం చేరవేసే క్రమంలో మెయిల్‌, లెటర్లు/ వివిధ అప్లికేషన్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. సమాచారాన్ని క్లుప్తంగా వీలైనంత తక్కువ పదాల్లో, సూటిగా వివరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, పై అధికారుల ఆదేశాలు ఇంగ్లిష్‌లోనే వస్తాయి. కాబట్టి ఇంగ్లిష్‌ భాషపై అభ్యర్థికి ఉన్న పరిజ్ఞానాన్ని పరీక్షించేలానే ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌ గ్రామర్‌, సెంటెన్స్‌ అరేంజ్‌మెంట్‌, ఆర్టికల్స్‌, ప్రిపొజిషన్స్‌, హెల్పింగ్‌ వెర్బ్స్‌, ఇంగ్లిష్‌ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం, కాంప్రహెన్సివ్‌ పేరాగ్రాఫ్‌, యాంటనిమ్స్‌, సిననిమ్స్‌, ఒకాబులరీపై ప్రశ్నలు వస్తాయి. గ్రామర్‌ను క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఏయే సందర్భాల్లో తప్పులు చేస్తున్నారో వాటిని నోట్స్‌లో రాసుకుంటూ మళ్లీ ఆ తప్పులు చేయకుండా ప్రయత్నించాలి. ఇంగ్లిష్‌లో మాట్లాడటం చేయాలి.

తెలుగు: ఎస్‌ఐ ఫైనల్‌ పరీక్షలో పేపర్‌-2 తెలుగు. ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌), పంచనామా, రిపోర్ట్‌, కంప్లైంట్‌ రాయడం వంటివి వృత్తిలో భాగం. దీనిలో తెలుగుపై అభ్యర్థులకు ఉన్న పట్టును పరీక్షిస్తారు. ప్రశ్నలు కూడా అలాగే ఉంటాయి. గ్రామర్‌ అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి. సంధులు, సమాసాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు, ఖాళీలు పూరించడం, తప్పు పదాలను గుర్తించడం వంటి ప్రశ్నలు వస్తాయి. పోలీసుశాఖ ఉద్యోగులకు తెలుగుపై కనీసావగాహన ఉండాలి. కాబట్టి ఈ పరీక్ష నిర్వహిస్తారు. అయితే ఇది కేవలం క్వాలిఫయింగ్‌ పరీక్షే.

జనరల్‌ సైన్స్‌, స్టడీస్‌: భారతదేశ చరిత్ర, భౌగోళికాంశాలు, ఆర్థికాంశాలు, రాజకీయాంశాలపై ప్రశ్నలుంటాయి. తెలంగాణ చరిత్ర, భౌగోళికాంశాలు, రాష్ట్ర అవతరణ, తెలంగాణ అమరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర, ఆర్థికాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. శాస్త్రీయ, సాంకేతిక అంశాలు, కరెంట్‌ అఫైర్స్‌ చూసుకోవాలి. తెలుగు అకాడమీ 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు చదివి నోట్స్‌ తయారు చేసుకుంటే మంచిది.

కరెంట్‌ అఫైర్స్‌ నుంచి వైరస్‌, టీకాలు, వ్యాక్సిన్లు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ముఖ్యమైన వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, రాష్ట్రంలో నూతనంగా ప్రారంభించిన సంస్థలు, రాష్ట్రాలు-ముఖ్యమంత్రులు, దేశాలు-ప్రధానమంత్రులు, రాష్ట్ర జంతువులు, ముఖ్యమైన కట్టడాలు చూసుకోవాలి.

పోలీసుశాఖ స్వరూపం మారింది
ఒంటిపై ఖాకీ దుస్తులు, తలపై ఠీవీగా నిలిచిన టోపీ, చేతిలో లాఠీ.. ప్రభుత్వ వాహనం దిగీదిగగానే వినమ్రంగా ముందుకొచ్చి నిల్చునే జనం.. ఈ దృశ్యం పోలీసు శాఖలోకి ప్రవేశించాలనుకునే యువతీయువకులకు స్ఫూర్తి కలిగిస్తుంది. మంచి ప్రతిభ చూపి కష్టపడి డిపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశిస్తే చాలు, ఆపై ఆ దర్జానే వేరు అనుకునే యువత.. మారిన పోలీసుశాఖ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. పరివర్తన చెందిన పోలీసు వ్యవస్థలో తాము నిర్వర్తించాల్సిన పాత్రను అంచనా వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా తమ వైఖరినీ, నైపుణ్యాలనూ పెంచుకోవాలి.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌, సోషల్‌ పోలీసింగ్‌ వంటి ఉదాత్త ధోరణులు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. పోలీసు శాఖ, సమాజం మధ్య దూరాన్ని తగ్గించడమే వీటి లక్ష్యం. జనంతో మమేకం కావడం నేటి పోలీసు వ్యవస్థ ధ్యేయాల్లో ఒకటి.

లాఠీతో జనాన్ని నియంత్రణలో ఉంచాలన్న పాత విధానానికి ఇప్పుడు కాలం చెల్లింది. లాఠీ స్థానంలో విశ్వాసం, సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) అమల్లోకి వచ్చాయి. పోలీసు స్టేషన్ల నిర్మాణంలో బాహ్య స్వరూపం నుంచి పోలీసు సిబ్బంది వైఖరిలో ఈ మార్పు కనిపిస్తోంది. నూతన సిబ్బంది నియామకం, శిక్షణ ద్వారా నూతన వైఖరి, ధోరణులను వారిలో ప్రోది చేయడం, రోజువారీ వృత్తి బాధ్యతల్లో విరివిగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటివాటిని తెలంగాణ రాష్ట్ర పోలీసు లక్ష్యాలుగా అవగాహన చేసుకోవచ్చు.

సాంకేతిక పరిజ్ఞానంలో..
తెలంగాణ పోలీసుశాఖ సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో దేశంలోనే అగ్రపథాన ఉంది. రహదారిలో నాలుగు కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ పోలీసు నిలబడి, గీత దాటినవారిని పట్టుకోవడం వంటి సనాతన సాంప్రదాయిక పరిస్థితి ఒకప్పటిది. ఇప్పుడు వివిధ కూడళ్ల వద్ద ట్రాఫిక్‌ సమాచారాన్ని సీసీ కెమెరాల ద్వారా అందుకుంటున్న చిత్రాలను పెద్ద తెరలపై చూసే మార్పు వచ్చేసింది. గీత దాటినవారి వాహనాలను గుర్తించి అపరాధ రుసుము వివరాలను వారి చరవాణులకు పంపే సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసుశాఖ అందిపుచ్చుకుంది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఉపకరణాల ద్వారా పోలీసుశాఖ సామాన్య ప్రజలకు చేరువ అవుతోంది. ఉదా: హాక్‌ ఐ (పౌరులు డౌన్‌లోడ్‌ చేసుకోగల యాప్‌) ద్వారా తమను ఎవరైనా మోసం చేయాలనుకుంటే వెంటనే ఫోన్‌ ద్వారానే ఫిర్యాదు చేయడం, కమ్యూనిటీ సీసీసీ టీవీలు, వాట్సాప్‌ గ్రూప్‌లు (ఇందులో స్థానిక ప్రజలు, స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సీఐ, ఎస్‌ఐ ఉంటారు) టీఎస్‌ కాప్‌ (పోలీసులు ప్రజలకు మధ్య అనుసంధానం), ఈ-ఆఫీసు (డీజీపీ కార్యాలయం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు వివిధ స్థాయిలో దైనందిన వృత్తి కార్యకలాపాలకు ఎలక్ట్రానిక్‌ వేదిక). ఈ-పెట్టీ కేస్‌ (చిల్లర మల్లర రహదారి, వీధి తగాదాల పరిష్కారం) యాప్‌. ఇప్పటికే విశేష ఆదరణ పొందిన షీ టీమ్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు!

మొత్తమ్మీద పోలీసుశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ పోస్టులను ఆశిస్తున్న యువతీయువకులు ఒకపక్క ఎంపిక దశల్లోని పరీక్షలకు సన్నద్ధం కావడం ఎంత ముఖ్యమో మరోపక్క మారిన పోలీసుశాఖ స్వరూపాన్ని అవగతం చేసుకోవడం ద్వారా అటు ఎంపిక దశల్లోనూ ఇటు వృత్తిలోనూ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు.

source : eenadu prathiba

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు