Wednesday, 27 June 2018

HOW TO GET BANK JOBS LIKE SBI-IBPS

బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలకు కంప్లీట్ గైడ్

ఎన్ని రకాల ఉద్యోగాలున్నా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. ఉద్యోగ భద్రత కావచ్చు, మంచి జీతభత్యాలు కావచ్చు, మంచి భవిష్యత్ కావచ్చు... ఇలా కారణాలు ఏవైనా ఇతర ఉద్యోగాల కన్నా వీటిపై యువతకు మోజు ఎక్కువగానే ఉంటుంది. అందుకే వందల సంఖ్యలో ఖాళీలు అని ప్రకటన వెలువడినా లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. రైల్వే ఉద్యోగాలతో పోలిస్తే బ్యాంకు ఉద్యోగాలకు డిమాండ్ మరింత ఎక్కువ. అయితే, అసలు బ్యాంకింగ్ రంగంలో ఏయే ఉద్యోగాలున్నాయి, వాటికి ఏ పరీక్షలు రాయాలి, ఎవరు ఈ పరీక్షలు నిర్వహిస్తారు, ఎలా సిద్ధం కావాలి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది...

బ్యాంకు ఉద్యోగం సాధించడం ఎలా?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు బ్యాంకింగ్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలను నిర్వహిస్తాయి. సుమారు 20 ప్రభుత్వరంగ బ్యాంకులు ఐబీపీఎస్ స్కోరు ఆధారంగానే వివిధ స్థాయిల్లోని ఉద్యోగాలకు నియామకాలు చేపడతాయి. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం క్లరికల్, ప్రొబేషనరీ ఆఫీసర్ల కోసం ప్రత్యేకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది.

ఎస్‌బీఐలో ఏయే ఉద్యోగాలుంటాయి?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం సుమారు 8000 క్లరికల్ అసిస్టెంట్ (జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్), ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేస్తుంది. ఇది సాధారణంగా ఏప్రిల్, మేలలో ఉంటుంది. జూన్‌లో ప్రాథమిక పరీక్ష, జులై/ఆగస్ట్‌లో మెయిన్స్ పరీక్ష ఉంటాయి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

సాధారణ అర్హతలేమిటి?

నిర్థారిత తేదీ నాటికి అభ్యర్థి వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు దీనికి అర్హులు.

పరీక్ష ఎలా ఉంటుంది?

ప్రిలిమినరీ పరీక్షలో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిని గంటలో పూర్తి చేయాలి. పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీనిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

మెయిన్స్‌లో 200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. వీటిని రెండు గంటల్లోపు పూర్తి చేయాలి. దీనిలో కూడా ఉత్తీర్ణులైతే ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తారు. ఇంటర్వ్యూలో మీ ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)
20 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని వివిధ స్థాయిల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది. సుమారు 4000 పీవో పోస్టుల భర్తీకి ప్రతి సంవత్సరం ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ప్రిలిమినరీ పరీక్ష సాధారణంగా అక్టోబరులోను, మెయిన్స్ నవంబరులోనూ నిర్వహిస్తారు.

ఐబీపీఎస్ పీవో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 5, 2018. అర్హులైనవారు ప్రిలిమినరీ పరీక్షకు సెప్టెంబరు నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పరీక్ష ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. మొదట ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాలి, తర్వాత మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

అలాగే ప్రతి సంవత్సరం సుమారు 8000 క్లరికల్ పోస్టుల భర్తీ ఐబీపీఎస్ ద్వారా జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఈ పరీక్ష కూడా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రిలిమినరీ పరీక్ష ఎస్‌బీఐ మాదిరిగానే ఉంటుంది. కానీ మెయిన్స్ మాత్రం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీనిలో 200 మార్కులకు 190 ప్రశ్నలుంటాయి. వీటిని పూర్తి చేయడానికి ఇచ్చే సమయం 160 నిమిషాలు.

ఐబీపీఎస్ - రీజనల్ రూరల్ బ్యాంక్స్ (ఆర్ఆర్‌బీ)
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే బ్యాంకులకోసం ప్రత్యేక ఆఫీసర్ల నియామకాలకోసం ఉద్దేశించిన పరీక్ష ఇది.

దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.

క్లరికల్ పోస్టులకోసం ఇంటర్వ్యూ ఉండదు. మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోతుంది.

కానీ ఆఫీసర్ కేడర్ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీని ద్వారానే తుది ఎంపిక జరుగుతుంది.

ఈ పరీక్షకు కూడా ప్రస్తుతం దరఖాస్తు అందుబాటులో ఉంది. ఆగస్టులో ప్రిలిమ్స్, సెప్టెంబరులో మెయిన్స్ జరుగుతుంది.

ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ - జూనియర్ మేనేజ్‌మెంట్
ఐటీ, అగ్రికల్చర్, రాజ్ భాష అధికారి, లా, హెచ్ఆర్, మార్కెటింగ్.. విభాగాలకు నిర్వహించే పరీక్ష ఇది. సుమారు 1400 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం భర్తీ అవుతాయి. వీటికి కూడా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగానే ఎంపిక జరుగుతుంది.

పరీక్షల్లో ఏయే అంశాలుంటాయి?
ప్రిలిమ్స్‌

న్యూమరికల్ ఎబిలిటీ
రీజనింగ్ ఎబిలిటీ
ఇంగ్లిష్ లాంగ్వేజ్
మెయిన్స్‌

జనరల్ ఫైనాన్స్ ఎవేర్‌నెస్
జనరల్ ఇంగ్లిష్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ
కంప్యూటర్ ఆప్టిట్యూడ్
ఈ అంశాలను జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ప్రాక్టీస్ చేస్తే బ్యాంక్ ఉద్యోగం సంపాదించడం కష్టమైన పనేం కాదు




#SOURCE BBC_TELUGU

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు