Friday, 29 June 2018

HOW TO QUALIFY FOR GROUP 4 & VRO

గ్రూప్-4, వీఆర్‌వో...విజయానికి మార్గాలు

ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ, దైనందిన ప్రజా జీవితంలో వారి సమస్యలు పరిష్కరించే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్‌వో), ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనిచేసే గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ప్రభుత్వ పాలనలో అత్యంత కీలకంగా ఉండే క్షేత్రస్థాయి ఉద్యోగాలకు ప్రకటనలు రావడంతో ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్‌లో లీనమయ్యారు. 1521 గ్రూప్ 4,700 వీఆర్‌వో ఉద్యోగాల ప్రకటనలను పరిశీలిస్తే.. ఒకే సబ్జెక్టులు, దాదాపుగా ఒకే సిలబస్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏకకాలంలో రెండు పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం లభించింది.

ఎలాంటి ఇంటర్వ్యూలు లేని నియామక ప్రక్రియ కావడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. దీంతో ఈ పరీక్షల్లో నెగ్గుకురావడం సవాలే. గ్రూప్ 4 పరీక్షను అక్టోబర్ 7న, వీఆర్‌వో పరీక్షను సెప్టెంబర్ 16న నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నద్ధమవుతోంది. అందువల్ల అందుబాటులో ఉన్న సమయాన్ని ప్రణాళిక ప్రకారం ఉపయోగించుకోవడం ద్వారా విజయం సాధించొచ్చు.

గ్రూప్-4 పరీక్ష విధానం :


సిలబస్..
జీకే: కరెంట్ అఫైర్స్; అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు; నిత్యజీవితంలో జనరల్‌సైన్స్; పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ; తెలంగాణ, ఇండియన్ జాగ్రఫీ, ఎకానమీ; భారత రాజ్యాంగం; భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం; ఆధునిక భారతదేశ చరిత్ర; తెలంగాణ చరిత్ర, ఉద్యమం; తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు.

సెక్రటేరియల్ ఎబిలిటీస్: మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్); లాజికల్ రీజనింగ్; కాంప్రెహెన్షన్; రీ అరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్; న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీస్.

వీఆర్‌వో పరీక్ష విధానం (వ్యవధి: 150 ని.) :



సిలబస్ :
జీకే: గ్రూప్ 4 సిలబస్‌లోని అంశాలే ఇందులోనూ ఉన్నాయి. అదనంగా ఎథిక్స్, బలహీన వర్గాలు, లింగ అసమానతలు, సామాజిక స్పృహ అంశాలను పొందుపరిచారు.

సెక్రటేరియల్ ఎబిలిటీస్: బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి); మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్); లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటికల్ ఎబిలిటీస్.

ప్రిపరేషన్ టిప్స్..
చాలా కాలంగా ప్రభుత్వ నోటిఫికేషన్లు రాకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో వీఆర్‌వో, గ్రూప్ 4 ఉద్యోగాలకు నిరుద్యోగ అభ్యర్థుల నుంచి పోటీ తీవ్రస్థాయిలో ఉంటుంది. ఈ నేపథ్యంలో పరీక్షల కాఠిన్యత ఎక్కువగా ఉండొచ్చని పోటీ పరీక్షల నిపుణులు చెబుతున్నారు.

అర్థమెటిక్/న్యూమరికల్ ఎబిలిటీ :
నాన్‌మ్యాథ్స్ అభ్యర్థులు అర్థమెటిక్/న్యూమరికల్ సెక్షన్‌ను క్లిష్టంగా భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. అయితే అకడమిక్ నేపథ్యంతో సంబంధం లేకుండా కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఈ సెక్షన్‌లోనూ వారు మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
తొలుత ప్రతి చాప్టర్‌లో ఉన్న బేసిక్స్ నేర్చుకోవాలి. సూత్రం ఆధారంగా సమాధానాలు రాబట్టే సమస్యలతో పాటు కేవలం నోటి లెక్కలతో చేయగలిగేవి కూడా ఉంటాయి. వీటికి వేగంగా, కచ్చితంగా సమాధానాలు గుర్తించొచ్చు. మరికొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్ల ద్వారా సరైన సమాధానాన్ని గుర్తించేందుకు వీలుంటుంది.
భాజనీయత సూత్రాలు, సరాసరి, కాలం-పని, ఎత్తులు-దూరాలు, లాభనష్టాలు, వడ్డీ, శాతాలు, క్షేత్రమితి, వైశాల్యం తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మెరుగైన మార్కుల సాధనకు ఇదొక్కటే సరైన మార్గమని గుర్తించాలి. సమస్యను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యం సొంతం చేసుకోవాలి. సందర్భానుసారం సూత్రాలను ఉపయోగించే విధంగా అవగాహన పెంచుకోవాలి.
ఆరు నుంచి పదో తరగతి వరకు గణిత శాస్త్ర అంశాలపై పట్టు సాధించడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఆర్‌ఎస్ అగర్వాల్, రాజేశ్ వర్మ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ తదితర పుస్తకాలు ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవచ్చు.

లాజికల్ రీజనింగ్ :
ఇందులో కోడింగ్/డీకోడింగ్, సంఖ్యా శ్రేణులు, అక్షర శ్రేణులు, ర్యాంకులు, సీటింగ్ అరెంజ్‌మెంట్, రిలేషన్స్, పదాల సారూప్యత, దిశ నిర్ధారణ, గడియారాలు, క్యాలెండర్, నాన్-వెర్బల్ రీజనింగ్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
ఈ విభాగంలో మెరుగైన మార్కులు సాధించాలంటే విషయ సంగ్రహణ, సామర్థ్యం, తర్కబద్ధంగా ఆలోచించడం తదితర నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. మాదిరి ప్రశ్నపత్రాలను నిరంతరం సాధన చేస్తుండాలి. నిర్దేశించిన సిలబస్ కాకుండా సాధారణ పరిజ్ఞానంపైనా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు వృత్తం అనేది వృత్తపరిధికి సంబంధించింది అయితే చతురస్రం అనేది దేనికి సంబంధించింది? (సమాధానం: చుట్టుకొలత).
వీఆర్‌వో, గ్రూప్ 4 పరీక్షల్లో ఇంగ్లిష్ నుంచి దాదాపు 15 చొప్పున ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. గ్రూప్ 4లో ఈ సంఖ్య ఎక్కువ ఉండొచ్చు. ఇంగ్లిష్‌లో కాంప్రెహెన్షన్, రీ అరేంజ్‌మెంట్‌పై ప్రశ్నలు వస్తాయి. వీటితో పాటు బేసిక్ గ్రామర్ రూల్స్, వొకాబ్యులరీని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్ :
సిలబస్ చూసి గాబరా పడకుండా కరెంట్ అఫైర్స్‌తో అధ్యయనం ప్రారంభించాలి. ప్రభుత్వ పథకాలు, విద్య, ఆరోగ్యం, జనాభా, పేదరికం, పారిశ్రామిక రంగం, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలను చదవాలి.
చరిత్రలో ప్రశ్నలు విషయ ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ సార్లు పునశ్చరణ చేసుకోవడం మంచిది. హైస్కూల్ స్థాయి వరకు ఉన్న అంశాలను చదవడం తప్పనిసరి. జాతీయోద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. భూగోళశాస్త్రంలో గ్రామీణ నేపథ్యం, వ్యవసాయం, ప్రాజెక్టులు, స్థానిక ప్రత్యేకతలు, సాగు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
అర్థశాస్త్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రభుత్వ దృష్టి, దానికి సంబంధించిన ముఖ్య గణాంకాలు గుర్తుంచుకోవాలి. ఆర్థిక సర్వే, తెలంగాణ అధికారిక మాస పత్రికను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను ప్రారంభించిన సంవత్సరాలు, లక్ష్యాలు, ప్రాతిపదికలు తదితర అంశాలను అధ్యయనం చేయాలి. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే ప్రకటనలు, కరపత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలి.
పౌరశాస్త్రానికి సంబంధించి అధిక శాతం ప్రశ్నలు పంచాయతీరాజ్ వ్యవస్థపై వస్తున్నాయి. ఈ క్రమంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, నిర్మాణం, విధులు; 73, 74వ రాజ్యాంగ సవరణలు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన, ఈ-గవర్నెన్స్, రెవెన్యూ పరిపాలన, వివిధ స్థాయిల్లోని అధికారులు-అధికారాలు-విధుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలి.
జీవశాస్త్రంలో విజ్ఞానశాస్త్ర చరిత్ర, విటమిన్లు, సూక్ష్మ జీవులు, మొక్కలు, జంతువులు, మానవ శరీరం-ఆరోగ్యం, పశు సంవర్ధనం, జీవన విధానాలు, పోషణ, నియంత్రణ, సమన్వయం, జీవశాస్త్రంపై పరిశోధనలు జరిపే సంస్థలు, అవి ఉన్న ప్రదేశాలు, కొత్తగా ఆవిష్కరించిన ముఖ్య ఔషధాలు, వైరస్‌లు వాటి నేపథ్యం తెలుసుకోవాలి.
భౌతిక-రసాయన శాస్త్రంలో ప్రశ్నలు ఎక్కువగా అనువర్తిత విధానంలో ఉంటాయి. నిత్య జీవితంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, సమకాలీన ఆవిష్కరణలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి.
తెలంగాణకు సంబంధించి ప్రాచీన, ఉద్యమ చరిత్రలను లోతుగా అధ్యయనం చేయాలి. ఉద్యమ చరిత్రలో 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు-వాటి సిఫార్సులు తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వీటితో పాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణ రాష్ట్రానికి కల్పించిన హక్కులపై దృష్టిసారించాలి.
చరిత్రకు సంబంధించి రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు-రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు-వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయమున్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. భౌగోళికంగా తెలంగాణలోని ముఖ్య నదులు- పరీవాహక ప్రాంతాలు; ముఖ్య పంటలు; భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టిసారించాలి.
తెలంగాణ భౌగోళిక స్వరూపం, విస్తీర్ణం, జనాభా తదితర అంశాలపై అవగాహన అవసరం. గ్రామీణాభివృద్ధితో ముడిపడి ఉన్న అంశాల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తున్నాయి. వీటిలో సంక్షేమ పథకాలు, విద్య, ఆరోగ్యం, పేదరికం, పారిశ్రామిక రంగం, సాగునీటి పారుదల తదితర అంశాలపై ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి.
వీఆర్‌వో పరీక్షలో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరీక్షించేలా కూడా ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఎథిక్స్, స్త్రీ-పురుష సమానత్వం, బలహీన వర్గాలు, సామాజిక స్పృహ తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.

1 comment:

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు