Wednesday, 27 June 2018

HOW TO BECOME AIR HOSTESS

ఎయిర్ హోస్టెస్ కావాలంటే కావాల్సిన అర్హతలివే


విమానాల్లో ప్రయాణించడం అనేది ఒకప్పుడు చాలా ఖరీదైన వ్యవహారం. కానీ ఆ రంగంలో పోటీ పెరగడంతో ఇప్పుడిది సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చింది.
దీనికి తోడు కొత్త విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతున్నాయి.
విమాన ప్రయాణమే ఓ అద్భుతం అనుకుంటుంటే... విమానంలో ఉద్యోగం అంటే! ఇది ఇంకా అద్భుతం. చాలామందికి దీనిపై ఆసక్తి ఉంటుంది.

విమానం అనగానే ముందుగా చాలామందికి గుర్తొచ్చేది ఎయిర్ హోస్టెస్. అందమైన రూపంతో, చక్కటి మాటతీరుతో ప్రయాణికులకు విమానప్రయాణంలో ఎదురయ్యే అవసరాలన్నింటినీ తీర్చే సహాయకారి.

మరి ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ (సిబ్బంది) కావడం ఎలా?

విమానయాన రంగంలో ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, పూర్తి చేయాల్సిన శిక్షణకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చాలా స్పష్టమైన నిబంధనలు రూపొందించింది.
మనం విమానంలోకి ప్రవేశించగానే మనకు ఎదురయ్యేది క్యాబిన్ క్రూ. వీరి పని కేవలం ప్రయాణికులను సాదరంగా ఆహ్వానించడం మాత్రమే కాదు, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రయాణికులను బయటకు వీలైనంత సురక్షితంగా ఎలా పంపించాలి, వైద్య సహాయం అవసరమైతే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి.. ఇలాంటి ఎన్నో అంశాలపై వీరికి శిక్షణ అవసరం.

క్యాబిన్ క్రూ కావాలంటే అర్హతలేమిటి?

10+2 ఉత్తీర్ణులు అర్హులు. ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే మాటతీరు, మీరు చెప్పదలచుకున్న అంశాల్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నారా లేదా, ఇంగ్లిష్ భాషలో మాట్లాడగలిగే సామర్థ్యం... ఇవీ ప్రధానంగా కావాల్సిన అంశాలు. మీకు ఏదైనా విదేశీ భాష వచ్చి ఉంటే అది మీకు మరింత ఉపయుక్తంగా ఉంటుంది. వీటితోపాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా, నిర్దేశిత ఎత్తుకు తగిన బరువు, నాణ్యమైన కంటి చూపు కలిగి ఉండాలి.
వీటితో పాటు దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాల ప్రయాణికులతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి.. భారత్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేయాలంటే ఇంగ్లిష్, హిందీ... ఈ రెండు భాషలూ వచ్చి ఉండాలి.
మరో ముఖ్యమైన అంశం... పాస్‌పోర్ట్. మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత విధుల్లో భాగంగా విదేశీ విమాన సర్వీసుల్లో కూడా ప్రయాణించాల్సి రావచ్చు. అందువల్ల పాస్‌పోర్ట్ కలిగిఉండటం తప్పనిసరి.

శిక్షణ ఎలా ఉంటుంది?

సాధారణంగా విమానయాన సంస్థలన్నీ వేటికవే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. వారు నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైనవారు సుమారు రూ.50000 వరకు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తికాగానే తమ సంస్థల్లోనే వీరికి అవకాశాలు కల్పిస్తారు.
శిక్షణలో భాగంగా... విమానం పనితీరు, ప్రయాణం జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు-చర్యలు... ఇలాంటి అంశాలన్నీ వివరిస్తారు. వీటితోపాటు ఫ్లయింగ్ అవర్స్ కల్పిస్తారు. ప్రతి సంవత్సరం నిర్దేశిత ఫ్లయింగ్ అవర్స్ ఉండటం డీజీసీఏ నిబంధనల ప్రకారం తప్పనిసరి.
పైలట్ ఏదైనా అనారోగ్యం పాలైనా, సిబ్బంది మధ్య సమస్యలు, ప్రయాణికులతో సమస్యలు, ప్రయాణికుల మధ్య సమస్యలు... ఇలాంటి పరిణామాల్లో ఎలా పనిచేయాలో కూడా క్యాబిన్ క్రూ లేదా ఎయిర్ హోస్టెస్‌లకు తెలిసి ఉండాలి. అవసరమైతే విమానాన్ని నడపగలిగే సామర్థ్యం కూడా వీరికి ఉండాలి. దీనిపై కూడా శిక్షణ అవసరం.
ఇవి కాకుండా ప్రైవేటు ట్రైనింగ్ స్కూళ్లు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో శిక్షణ తీసుకుంటే ఉద్యోగం కోసం మళ్లీ ప్రయత్నించాల్సిందే. ఇది కొద్దిగా కష్టమైన పని. పైగా వీరి శిక్షణలో ఫ్లయింగ్ అవర్స్ ఉండకపోవచ్చు.
ఒక్కసారి సెలక్ట్ అయితే... క్యాబిన్ క్రూగా కొద్ది రోజులు చేశాక, కావాలనుకుంటే ఎయిర్‌పోర్టుల్లో ఉండే ఉద్యోగాలకు మారే అవకాశం కూడా ఉంటుంది.

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు