Wednesday, 8 August 2018

Essay On Karunanidhi Life

కరుణానిధి - తమిళుల్లో ఎందుకింత ఉద్వేగం? ఎక్కడిదీ అభిమానం?



కరుణానిధి నిండు జీవితం గడిపి వెళ్లిపోయినా తమిళుల కెందుకింత ఉద్వేగం. అంత శోకం ఎక్కడినుంచి వస్తున్నది? పెద్ద నాయకులు పోయినప్పుడల్లా తమిళుల ఉద్వేగ ప్రదర్శన మీద ఈ ఆసక్తి చాలా మందిలో కనిపిస్తుంది. సాధారణంగా భావజాల బంధం మనుషులను దగ్గర చేస్తుంది. ఆ భావజాలానికి ప్రతినిధిగా ఉన్న నాయకుడిని తమ వాడిగా భావించుకునేట్టు చేస్తుంది. తమ సామూహిక గొంతుకగా భావించేట్టు చేస్తుంది. ఆ భావజాలం వ్యాప్తి, బలం మీద ఆ బంధం ఆధారపడి ఉంటుంది. పేదలకు మేలు చేసే సంక్షేమ పథకాలు నేతలను మరింత దగ్గర చేస్తాయి. ఆరాధనా భావాన్ని పెంచుతాయి. కళ మనుషులకు దగ్గర చేసే మరో సాధనం. అందులోనూ అత్యంత శక్తిమంతమైన సినిమా మరింత దగ్గర చేస్తుంది. ఇంటిమనిషిగా మారుస్తుంది. ఆ మూడు లక్షణాలూ మూర్తీభవించిన నేత కరుణానిధి.


ద్రావిడోద్యమ మూలస్థంభం


పదిమంది తమిళులను కలిస్తే అందులో సగమైనా ఏదో ఒక స్థాయి ద్రావిడ రాజకీయాలు మాట్లాడతారు. ఇద్దరు ముగ్గురైనా ఏదో ఒక స్థాయి భక్తి రాహిత్యాన్ని ప్రదర్శిస్తారు. మిగిలిన వారిలో కూడా ఎక్కువ మందికి భక్తి వైయక్తికం, ప్రదర్శనా వస్తువు కాదు అనే భావనే ఉంటుంది. ద్రావిడోద్యమం కేవలం అధికారానికి రావడం తోనే ఆగిపోలేదు. సమాజంలోకి దాని వేళ్లు లోతుగా విస్తరించాయి అనేదానికి ఇది నిదర్శనం. అడుగడుగునా మూలమూలనా, గుళ్లూ గోపురాలూ కనిపించే తమిళనాట దైవభక్తిని, మతంతో ముడిపడిన ఆచారాలను సంప్రదాయాలను, కులాధిక్యతను వ్యతిరేకిస్తూ మొదలైన ఒక ఉద్యమం ఇంతగా వేళ్లూనుకోవడం సాధారణ విషయం కాదు. మతం అనే భావన ప్రజాజీవితంలో చొరబడకుండా రాజకీయ సమీకరణ సాధనంగా మారకుండా కట్టడి చేయడంలో తమిళనాడు ఇప్పటివరకూ విజయం సాధిస్తూ వస్తున్నది. దేశంలో ఎక్కడ ఏ రకమైన మతఘర్షణలు చెలరేగినా తమిళనాట దాని ప్రతిధ్వనులు వినిపించకుండా గంభీరంగా ఉంటున్నది. ఏ బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా అయితే ద్రావిడ ఉద్యమం మొదలైందో అదే బ్రాహ్మణ కులానికి చెందిన నాయకురాలైన జయలలిత, వీరభక్తి- అనేకానేక నమ్మకాలు ఉన్న జయలలిత అధికారంలో ఉన్నపుడు కూడా ఏదో ఒక స్థాయి ద్రావిడ రాజకీయాలే రాజ్యమేలాయి. ఆమె ఆ ద్రావిడ పరిభాషకు మరీ దూరంగా వెళ్లేందుకు సాహసించలేని పరిస్థితి. అధికార సమీకరణాలను అంతగా మారిపోయాయి. అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ద్రావిడ ఉద్యమానికి కుడీ ఎడమే గానీ వేరుగా ఉండే పరిస్థితి లేదు.

ఇపుడైతే ద్రావిడ స్ఫూర్తి పలుచబడింది అనే విమర్శలున్నాయి. ద్రావిడ పునాదుల మీద ఎదిగొచ్చిన కొన్ని శూద్ర అగ్ర కులాలు కొత్త రకం పెత్తందారీ పోకడలు పోతున్నాయి అనే విమర్శలున్నాయి. ద్రావిడ రాజకీయ పాయల్లో విశ్వాసం, అవిశ్వాసం రకరకాల రూపాలు తీసుకుని ఉండొచ్చుగానీ మతం సమీకరణ సాధనంగా, విద్వేష సాధనంగా మారకుండా చూడడం ద్రావిడ ఉద్యమం సాధించిన విజయం. ఒక రకంగా ద్రావిడోద్యమం మతం కొమ్ములు విరిచేసి సాధుజంతువును చేసింది. ఆ ద్రావిడ ఉద్యమం మూల స్థంభాల్లో చిట్టచివరి మూల స్థంభం కరుణానిధి. నాస్తికత్వాన్ని చాటుకుంటూ భారత రాజకీయాల్లో రాణించడం ఎదురీత. తాను మోదీని మించిన భక్తున్ని అని చాటుకోవడానికి రాహుల్ గాంధీ గుళ్లూ గోపురాల చుట్టూ ఎలా తిరుగుతున్నారో చూస్తూనే ఉన్నాం. ఉత్తరాదిన భక్తి పోషించే పాత్రని భాషతో పూరించుకున్నది ద్రావిడోద్యమం. భాషను శక్తిమంతమైన రాజకీయ సాధనంగా సమీకరణ సాధనంగా వాడుకున్నది. తమ భావజాలంతోనూ సంక్షేమ విధానాలతోనూ భూస్వామ్య వ్యవస్థను తదుపరి దశలోకి మళ్లించడంలో చోదక శక్తిగా ద్రావిడోద్యమం పనిచేసింది. అందులోని సంక్లిష్టతలన్నీ తమిళనాట కనిపిస్తాయి. హరిత విప్లవం నుంచి వచ్చిన వ్యవసాయ సంపద పారిశ్రామిక రూపం తీసుకోవడం, అది సృష్టించిన కొత్త ఆధిపత్య కులాలు - మొత్తం పరిణామాలన్నింటా తమిళనాట, తెలుగునాట దాదాపు ఒకే కోవలో కనిపిస్తాయి.


సంక్షేమ సారధి


ప్రజలకు నేరుగా మేలు కలిగించే ఏ భారీ సంక్షేమ పథకమైనా నాయకులను దగ్గరచేస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు ఉద్వేగం ఆ స్థాయిలో పెల్లుబుకడానికి కారణం కేవలం ఆ ప్రమాదం జరిగిన తీరు మాత్రమే కాదు. మీడియా మాత్రమే కాదు. ఆ రెంటిపాత్ర ఉన్నప్పటికీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్, ఉచిత విద్యుత్. ఈ మూడూ కూడా పేదల్లో సానుకూల ఇమేజ్ సృష్టించాయి. తమ జీవితాలను ఏ కొద్దిగా నైనా మెరుగుపరిచే పనులు చేసిన నాయకులను జనం మర్చిపోరు. అవినీతి, బంధుప్రీతి కాసేపు వెనక్కు వెళ్లిపోయి చేసిన మంచిపనులే ముందుకొస్తాయి. ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న చౌక బియ్యం పంపిణీ పథకానికి ఆలోచనా బీజం వేసింది ద్రావిడోద్యమ నేత అన్నాదురై. తమిళనాడులో సుదీర్ఘకాలం గడిపిన ఎన్టీఆర్ తాను ముఖ్యమంత్రి కాగానే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించిన మహిళలకు ఆస్తిహక్కును తొలిసారి అమలు చేసింది కరుణానిధి. ఆ తర్వాత ఎన్టీఆర్ పాలనా పగ్గాలు చేపట్టాక తెలుగు నేలకు దాన్ని విస్తరించారు. ఇవాళ దేశవ్యాప్తంగా విస్తరించిన మధ్యాహ్న భోజన పథకం సృష్టికర్త ఎంజిఆర్.
నాయకులు అధికారంలోకి రావడానికే ఎన్నికల్లో గెలుపుకోసమే పథకాలు అమలుచేస్తారనే మాట ఒక అర్థంలో నిజమే కానీ నాయకులు ఎంచుకునే పథకాలు, వాటి మేలు అంతకంటే పెద్ద వాస్తవం. మనిషిని మనిషి లాక్కెళ్లే అమానవీయమైన లాగుడు రిక్షాలను 1973లోనే నిషేధించిన దార్శనికుడు కరుణానిధి. సుదీర్ఘకాలం వామపక్ష పరిపాలనలో ఉన్న కోల్ కతా వీధుల్లోపర్యటించేటప్పుడు ఆ లాగుడు రిక్షాలను చూసినపుడు కరుణానిధి కచ్చితంగా గుర్తుకొస్తారు. తమిళనాడు నుంచి విడిపోయినా తెలుగు తమిళ సమాజాలు పరస్పరం ప్రభావితమవుతూనే ఉన్నాయి. అన్నాదురై కలల పథకమైన చౌకబియ్యం పథకాన్ని ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అమలు చేస్తే.. వైఎస్సార్కు పేరు తెచ్చిన రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీలను డీఎంకే అందుకుంది. అక్కడి అమ్మ క్యాంటీన్లను ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలూ రెండూ అందిపుచ్చుకున్నాయి. బ్రాహ్మణాధిక్య వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత ఛాయలు కూడా ఎంతో కొంత తెలుగు దేశం రాజకీయాలను కూడా ప్రభావితం చేశాయి. పెరియార్ లాగే తెలుగునాట త్రిపురనేని రామస్వామి చౌదరి ఉన్నారు. ఆయన నేతృత్వంలో సాగిన హేతువాద ఉద్యమం ఉంది. కరణాలు, రెడ్ల వ్యవస్థ రద్దు వెనుక అప్పటికే వ్యవస్థలో కదలబారుతున్న సామాజిక సమీకరణాల మార్పుతో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ తాలూకు ఛాయలు కూడా ఉన్నాయి.


స్టార్ మేకర్


సాధారణంగా సినిమాల్లో హీరోలకు తప్ప రచయితలకు అంత స్టార్ డమ్ ఉండదు. కానీ కరుణ లాంటి వాళ్లు మినహాయింపు. ప్రజాశక్తి, మనోహర లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగులతో ఆయన ఎంజిఆర్, శివాజీల స్టార్ డమ్ పెంచేశారని చెపుతుంటారు. ఆ రకంగా ఆయన్ను స్టార్ మేకర్ అంటుంటారు. కరుణానిధి స్టార్ రైటరే కాదు, స్టార్ స్పీకర్. ఆయన్ను కలైంజర్ అంటే కళాకారుడు అని పిల్చుకోవడంలోనే ఆయన మూర్తిమత్వం దాగుంది. ఆయన మాటతీరులోనే చమత్కారం దాగుంటుంది. ఆయన పలుకులోనే కవిత్వ ఛాయలుంటాయి. చదువుకుని మాట్లాడే తరానికి చెందిన మనిషి.
దేశాన్ని అప్పటివరకూ ఉన్న పాతకాలపు సంబంధాలనుంచి కొత్త దశలోకి మళ్లించడంలో మార్గదర్శిగా పనిచేసింది ద్రావిడోద్యమం. అది వారి ఆధునిక పద్ధతుల్లో కనిపిస్తుంది. పారిశ్రామీకరణలో కనిపిస్తుంది. కమ్యూనిస్టులనుంచి కొన్ని అంశాలు తీసుకుని క్లాస్ కాస్ట్ కలయికతో కొత్త రాజకీయాలను పరిచయం చేసింది. అంబేద్కర్ కులనిర్మూలన గురించి ఎక్కువగా మాట్లాడితే పెరియారూ ఆయన వారసులూ మతసంప్రదాయాలు బ్రాహ్మణ వ్యతిరేకతకు అధిక ప్రాధాన్యమిస్తూ శూద్రులను కేంద్రంగా చేసుకున్నారు. దేవుడు, మతము, శాస్ర్తాలు, బ్రాహ్మలు ఈ నాలుగు అంశాల ఆధిపత్యాన్ని కూలదోయకుండా కులాన్ని ఏమీ చేయలేమని పెరియార్ చెప్పడంలో ఎవరి ప్రాధాన్యాంశం ఏమిటనేది అర్థమవుతుంది. భావజాల పరంగా సమానత్వం గురించి ఎక్కువగా మాట్లాడినా ఆచరణలో కొత్త ఆధిపత్య సమీకరణాలకు దారితీసింది. వ్యవసాయ రంగంలో సాగిన హరిత విప్లవం ఆయా ప్రాంతాల్లో శూద్ర రైతాంగ శ్రేణుల్లో కొత్త ఆధిపత్య కులాలను సృష్టించింది. పారిశ్రామీకరణలోనూ వారే ముందున్నారు. రానురాను ద్రావిడ ఉద్యమం చెప్పుకున్న సమానత్వం పక్కకుపోయి శూద్రకులాల మధ్య ఆధిపత్యపోరు రాజకీయాల్లో ఎక్కువవుతూ వస్తున్నదనే విమర్శలున్నాయి.
వీటితో పాటు డీఎంకే మీదా అందులోనూ కరుణానిధి హయాం మీద బోలెడన్ని విమర్శలున్నాయి. ఆరోపణలున్నాయి. బంధుప్రీతి, అవినీతి తీవ్రమైనవి. తండ్రి నుంచి స్టాలిన్ వారసత్వం తీసుకోవడంలోనే కాదు, మరో కుమారుడు అళగిరి అటు ఎంపి కాగానే కేంద్రంలో మంత్రి అయిపోతారు. మనుమడు కళానిధి మారన్ మంత్రి అయిపోతారు. కుమార్తె కనిమొళి చక్రం తిప్పుతూ ఉంటారు. మీడియా, ఇండస్ర్టీ, వనరులు అన్నింటా మోనోపలీ రాజకీయాలు తలెత్తాయనే విమర్శలున్నాయి.


విమర్శలు, ఆరోపణలు


ఇక డీఎంకే హయాం అవినీతిని సంస్థాగతం చేసిందనే విమర్శలు బలంగా వినిపిస్తూఉంటాయి. వీటితో పాటు శ్రీలంక తమిళుల విషయంలో డీఎంకే పోషించిన పాత్రమీద బొలెడన్ని విమర్శలున్నాయి. ఎన్నున్నా ఒక నాయకుడి సుదీర్ఘ చరిత్ర తీసుకున్నపుడు వర్తమాన రాజకీయ వాతావరణాన్ని పోల్చి చూసుకున్నపుడు కరుణానిధి నాయకుల మధ్య స్టేట్స్మన్ లాగా కనిపిస్తారు. బతికినంత కాలం చదువుతూ రాస్తూ జనంతో గడుపుతూ ప్రజాజీవనంలో తలమునకలుగా ఉన్న నేత కరుణానిధి. దక్షిణాది పురోగామి పథంలో ఉంటుంది అనే మాట తరచుగా వినిపించడంలో తమిళనాడు తన వంతు పాత్ర పోషించింది. కింది కులాలు పైకి రావడానికి నిచ్చెనమెట్టుగా పనిచేసింది. అందువల్ల ఆయా రాజకీయాలకు వాటి ప్రతినిధులకు జనంలో ఉద్వేగపూరితమైన బంధం ఉంటుంది అనుకోవచ్చేమో.
ప్రజాస్వామీకరణ తగినంత జరగక, బలమైన నేతల చుట్టూ అల్లుకున్న రాజకీయాలు జనాన్ని ఆధారపడేవాళ్లలాగా మారుస్తాయి. అది.. కొంత మేరకు సైకో ఫ్యాన్సీ రాజకీయాలకు కూడా దారి తీస్తుంది. తమిళ రాజకీయాల్లో ఈ కోణం కూడా కనిపిస్తుంది.
సాధారణంగా ఒక శకం అంతరించింది అనేమాట చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటారు. నిజమైన అర్థంలో ద్రావిడ రాజకీయాల్లో ఇపుడు ఒక శకం అంతరించినట్టే.


No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు