Saturday, 23 June 2018

VRO ONLINE CLASS 3

1.  వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు.
DAY 3



వర్తమానాంశాలు - ప్రాంతీయం  - 3

* తెలంగాణ అభివృద్ధికి పథకాలు
* గోదావరికి మహాపుష్కరాలు
* ప్రజాకవికి ప్రభుత్వ నీరాజనం

తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం 2015లో విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఈదిశగా పలు ప్రగతి పథకాలు, కార్యక్రమాలను ప్రారంభించింది. అటవీ అభివృద్ధికి పెద్దపీట వేసింది.
మరోవైపు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బోనాలు పండగ.. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి.. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం వచ్చిన గోదావరి మహాపుష్కరాలు..
వీటిని వైభవంగా నిర్వహించింది. పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందించి సత్కరించింది. సినారె, డీఎస్ లాంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించింది..
ఇలాంటి ఎన్నో విశేషాల అవలోకనం టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల కోసం..


నియామకాలు 

* తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టరు (జేఎండీ)గా సి.శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది.
* ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ (ఐఆర్ఏఎస్)కు చెందిన ఆయన గత నాలుగేళ్లుగా డిప్యూటేషన్‌పై సీపీడీసీఎల్ ఆర్థిక విభాగం డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.
* డిప్యూటేషన్ ముగిసినా మరో రెండేళ్లు కొనసాగించేందుకు కేంద్ర రైల్వేశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందింది.
* తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (టీఎస్ఎంఎఫ్‌సీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా షఫియుల్లా నియమితులయ్యారు.
* ఈయన ప్రస్తుతం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్ పద్ధతిలో ఏడాదిపాటు టీఎస్ఎంఎఫ్‌సీ ఎండీగా కొనసాగుతారు.
* మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)ను తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ 2015 ఆగస్టు 21న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
* దీని ప్రకారం కేబినెట్ ర్యాంకుతో 'అంతర్ రాష్ట్ర వ్యవహారాలు' బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఈ నియామకం ఏడాదిపాటు ఉంటుంది.
* నిజామాబాద్‌కు చెందిన డి.శ్రీనివాస్ రెండు సార్లు ఉమ్మడి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
* తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి (సినారె) 2015 ఆగస్టు 1న ఎంపికయ్యారు.
* సినారెకి 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది.
* సినారె ప్రముఖ రచనలు కర్పూర వసంతరాయలు, విశ్వంభర..

హరిత హారం

* రాష్ట్రంలో అడవులను 24 నుంచి 33 శాతానికి పెంచే లక్ష్యంతో హరిత హారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జులై 3న రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని
శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రారంభించారు.
* మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం.

గోదావరి పుష్కరాలు 

* 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన గోదావరి మహా పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది.
* తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వచ్చిన పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం 2015 జులై 14-25 తేదీల మధ్య నిర్వహించింది.
* ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురి వద్ద గోదావరిలో పుణ్యస్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు.


ఒప్పందాలు 

ఇరాన్‌తో: * తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, ఇరాన్‌ల మధ్య 2015, జులై 14న రవీంద్రభారతిలో సాంస్కృతిక ఒప్పందం కుదిరింది.
* ఇందులో భాగంగా ఒకరి కళారూపాలను ఇంకొకరు గౌరవించాల్సి ఉంటుంది.
* ఇందులో భాగంగా 2015, జులై 26న ఇరాన్ కళాకారులు ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇజ్రాయిల్‌తో : * తెలంగాణ, ఇజ్రాయిల్ మధ్య నృత్యకళా ఒప్పందం జరిగింది.
* హైదరాబాద్‌లోని ఐ అండ్ పీఆర్ కార్యాలయంలో 2015, జులై 16న ఇజ్రాయిల్ దేశ సాంస్కృతిక ప్రతినిధి కణా అంజి, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి
బీపీ ఆచార్య మధ్య ఒప్పందం కుదిరింది.
* దీనిలో భాగంగా తెలంగాణ 'పేరిణీ నృత్యం'ను ఇజ్రాయిల్‌లో ప్రదర్శించేందుకు, ఇజ్రాయిల్ 'గాగా డాన్స్ ఫామ్‌'ను తెలంగాణలో ప్రదర్శించేందుకు ఒప్పందాలు కుదిరాయి.
* అక్టోబరు, నవంబరు నెలల్లో 'గాగా డాన్స్ ఫామ్' నృత్య ప్రదర్శనలు తెలంగాణలో ఇవ్వనున్నారు.


పురస్కారాలు

* తెలంగాణ ప్రభుత్వం తొలిసారి ప్రదానం చేస్తున్న దాశరథి కృష్ణమార్యులు అవార్డును ప్రముఖ సాహితీవేత్త 'తిరుమల శ్రీనివాసాచార్యులు'కు దాశరథి జయంతి అయిన జులై 22న అందజేశారు.
* ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కొమురం భీమ్ మనుమడు సోనేరావుకు కొమురం భీమ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
* ఆచార్య కొత్తపల్లి జయశంకర్ పేరిట ఏర్పాటు చేసిన 'ఆచార్య దేవోభవ' పురస్కారాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అందుకున్నారు.
ఆగస్టు 17న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన జయశంకర్ జయంతి ఉత్సవాల్లో కోదండరామ్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
'గివ్ ఇట్ అప్‌'లో తెలంగాణ
* ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకుని, వారికి మరిన్ని రాయితీ సిలిండర్లు అందించేందుకు వీలుగా కేంద్రం ప్రారంభించిన 'గివ్ ఇట్ అప్' కార్యక్రమంలో భాగంగా
దేశ వ్యాప్తంగా 13,86,885 మంది గ్యాస్ రాయితీని వదులుకున్నారు.
* కేంద్ర పెట్రోలియం శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.
* 'గివ్ ఇట్ అప్‌'లో దేశంలో తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది.
* ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది.
'బోవెరా' పురస్కారం
* ప్రముఖ కవి, జానపద గాయకుడు అయిన గోరేటి వెంకన్నకు ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు, గాంధేయవాది అయిన బోయినపల్లి వెంకట రామారావు పేరిట ఏర్పాటు చేసిన
'బోవెరా కవితా పురస్కారం' లభించింది.
* బోవెరా జయంతి సందర్భంగా కరింనగర్‌లోని బోవెరాభవన్‌లో 2015 సెప్టెంబరు 2న పురస్కారం ప్రదానం చేశారు.


గ్రామాల అభివృద్ధి 

* గ్రామాల సమ్మిళిత-సమీకృత అభివృద్ధి సాధన లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామజ్యోతి కార్యక్రమాన్ని 2015, ఆగస్టు 17న వరంగల్ జిల్లా, గంగదేవిపల్లిలో ప్రారంభించారు.
* రానున్న అయిదేళ్లలో ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం 25 వేల కోట్లు ఖర్చు చేయనుంది.
* ఈ కార్యక్రమం కింద జనాభా ప్రాతిపదికన ప్రతి గ్రామానికి 2 నుంచి 6 కోట్ల రూపాయలు అందిస్తారు.


లక్ష్యాలు 

* గ్రామాల్లో సమ్మిళిత-సమీకృత అభివృద్ధి సాధించడం.
* పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం.
* గ్రామ పంచాయతీలను క్రియాశీలకంగా మార్చడం.
* గ్రామస్థాయిలోనే 'గ్రామసభ'ల ఆమోదంతో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, అమలు..


తెలంగాణ పల్లెప్రగతి

* తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల జీవనోపాధిని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 'తెలంగాణ పల్లెప్రగతి' కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు 2015,
 ఆగస్టు 22న మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రారంభించారు.
* ఈ కార్యక్రమం మొత్తం వ్యయం రూ. 642 కోట్లు.. (ఇందులో ప్రపంచ బ్యాంకు రూ. 450 కోట్ల ఆర్థికసాయం అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.192 కోట్లు వెచ్చిస్తుంది.)
* తెలంగాణలో 37.5 లక్షల మంది పేద గ్రామీణులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది.
* ఎంపిక చేసిన 150 మండలాల్లో అయిదేళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.


ముఖ్యాంశాలు: గ్రామస్థాయిలో 2.5 లక్షల పేదల ఉత్పత్తిదారుల సంఘాలు, కృషి మార్ట్‌ల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంపు.
* వ్యవసాయ పద్ధతులు, మార్కెటింగ్ మెలవకులపై శిక్షణ. గొర్రెలు, మేకల పెంపకంతోపాటు వరి, తృణ ధాన్యాల ఉత్పత్తి తదితర అంశాల్లో వారికి చేయూత..
* 2.5 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్యం, ఆహార భద్రత కల్పించడం.
* 1,000 గ్రామ పంచాయతీల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాల ఏర్పాటు.
* తెలంగాణ పల్లెప్రగతి కార్యక్రమాన్ని 'తెలంగాణ రూరల్ ఇన్‌క్లూ జివ్ గ్రోత్ ప్రాజెక్ట్ (టీఆర్ఐజీపీ)' అని కూడా అంటారు.


బోనాలు

* తెలంగాణ రాష్ట్ర పండ‌గ అయిన బోనాల‌ను 2015, ఆగ‌స్టు 2న రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ‌రరావు సికింద్రాబాద్ మ‌హంకాళీ అమ్మవారికి బోనం స‌మ‌ర్పించి ప్రారంభించారు.
* తెలంగాణ జాన‌ప‌ద సంస్కృతికి ప్రతిబింబ‌మైన బోనాల కోసం రూ. 10 కోట్ల వ్యయంతో ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ భాషాదినోత్సవంగా కాళోజీ జయంతి 

కాళోజీ స్మారక పురస్కారం : * ప్రజాకవి కాళోజీ నారాయణరావు విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయన పుట్టిన రోజును (సెప్టెంబరు 9) తెలంగాణ భాషా దినోత్సవంగా గుర్తిస్తున్నట్లు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు కాళోజీ 101వ జయంతిని రాష్ట్రస్థాయిలో అధికారికంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు రాష్ట్ర పర్యటక,
సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో 2015 సెప్టెంబరు 9న తెలంగాణ భాషాదినోత్సవాన్ని నిర్వహించారు.
* రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాల్లో.. కాళోజీ జీవితం, సాహిత్యం, కవిత్వంపై చర్చలు, ఉపన్యాసాలు, కవి సమ్మేళనాలు, నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
* తెలంగాణ భాషా దినోత్సవం, కాళోజీ జయంత్యుత్సవాలతో పాటు, కాళోజీ స్మారక పురస్కారం-2015 ప్రదాననోత్సవం కూడా సెప్టెంబరు 9న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించారు.
* మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాళోజీ పురస్కారాన్ని ప్రముఖ కవి, విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్‌కు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, హోం మంత్రి
నాయిని నరసింహారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు
* కాళోజీ నారాయణరావు కుటుంబం కర్ణాటక రాష్ట్రం బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చి మడికొండ గ్రామంలో స్థిరపడింది.
* కాళోజీ 1914, సెప్టెంబరు 9న జన్మించారు.
* కాళోజీ తల్లిదండ్రులు రంగారావు, రమాబాయమ్మ.
* ప్రాథమిక విద్య అనంతరం పాతబస్తీలోని 'చౌమొహల్లా' పాఠశాలలో కొంత కాలం కాళోజీ చదివారు. ఆ తర్వాత సిటీకాలేజీలోనూ చదివారు.
* 1939లో హైదరాబాద్‌లోని హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు.
* స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర మరువలేనిది.
* రాజకీయ వ్యంగ్య కవిత్వం రాయడంలో కాళోజీ దిట్ట. 'నా గొడవ' పేరిట సమకాలిన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా పాలకులపై అక్షరాస్త్రాలు సంధించారు.
 ఈ గ్రంథం అత్యంత ప్రజాదరణ పొందింది.
* విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించారు.
* వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకే ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు.
* ఆంధ్ర సారస్వత పరిషత్తు, తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించారు.
* విశాలాంధ్ర కావాలని ఆశించిన కాళోజీ, విశాలాంధ్ర వల్ల ఎదురయ్యే సమస్యలను గుర్తించి 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
* కాళోజీ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ పురస్కారంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ప్రజాకవి' బిరుదుతో సత్కరించాయి.
* కాకతీయ యూనివర్సిటీ 1992లో కాళోజీకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
* కాళోజీ తన దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు, నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాకతీయ మెడికల్ కాలేజీ (కెఎంసీ) పేరును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంగా
 ప్రభుత్వం మార్చింది.
* కాళోజీ నారాయణరావుని 'కాళోజీ, కళన్న, ప్రజాకవి(బిరుదు)' అని పిలుస్తారు.
* కాళోజీ 2002, నవంబరు 13న మరణించారు.

రచనలు : 
* అణాకథలు - 1941, పార్థివ వ్యయం - 1946, కాళోజీ కథలు - 1943, జీవనగీత - 1968 (అనువాద గ్రంథం), నాగొడవ - 1953, నా భారతదేశ యాత్ర - 1941 (అనువాదం), తెలంగాణ ఉద్యమ కవితలు - 1969-70.
* కాళోజీ గ్రంథం 'నాగొడవ' తొలిసారిగా 1953 జనవరి 12న ముద్రితమైంది. తర్వాత చాలాసార్లు పునర్‌ముద్రించారు.
* కాళోజీ ఆత్మకథ పేరు - ఇది నాగొడవ (1995)
కాళోజీకి స్ఫూర్తినిచ్చే సూక్తులు.. 1.'ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక', 2. 'పుటక నీది - చావు నీది - బతుకంతా దేశానిది'. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ మరణించినపుడు కాళోజీ అన్న మాటలు.



వర్తమానాంశాలు - జాతీయం  - 3

* ప్రణాళిక సంఘం రద్దు
* నీతిఆయోగ్ ఏర్పాటు

ఏ దేశంలో అయినా.. ఏ వ్యవస్థలో అయినా మార్పు అనివార్యం. సమాజ, మానవ జీవన పరిణామక్రమం చెబుతున్న సత్యమిది. ఒకప్పుడు గొప్పగా పనిచేసే వ్యవస్థలు.. సంస్థలు..
ఏవైనా అనంతర కాలంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మార్పు చెందడమో.. కొత్తరూపును సంతరించుకోవడమో తప్పనిసరి. భారతదేశంలో ఆరు దశాబ్దాలకు పైగా పనిచేసిన
ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతిఆయోగ్ కూడా ఇలాంటిదే. స్వాతంత్య్రం సిద్ధించేనాటికి అప్పటి భారతదేశ అవసరాల దృష్ట్యా తొలి ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేసిన ప్రణాళిక సంఘం
దేశాభివృద్ధి దిశగా అనేక విజయాలు సాధించింది. క్రమేపీ కొన్ని విమర్శలకు కూడా గురైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ హయాంలో ప్రణాళిక సంఘం రద్దయి
కొత్త వ్యవస్థగా నీతిఆయోగ్ ఏర్పాటైంది. ప్రణాళిక సంఘం ఎలా పనిచేసింది? నీతిఆయోగ్ ఎలా పనిచేయనుంది? విశేషాల సమాహారమిది..
స్వాతంత్య్రం సాధించిన తర్వాత భారతదేశంలో.. వివిధ రంగాల్లో పెద్దఎత్తున జరగాల్సిన అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న రోజులవి.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సోషలిస్ట్ భావాలకు, రష్యా సాధించిన పురోగతికి ప్రభావితమై.. దేశం ప్రగతిబాటలో పయనించాలంటే అది ప్రణాళికబద్ధమైన వ్యూహాలతోనే సాధ్యమని విశ్వసించారు.
ఈ మేరకు 1950, మార్చి 15న ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. దూరదృష్టితో దేశ అవసరాలకు సరిపోయేలా విధి విధానాలను రూపొందించడం.. వివిధ రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను
సూచించడం.. దేశ ఆర్థిక వనరులను రాష్ట్రాలకు కేటాయించడం.. లాంటి ప్రధాన లక్ష్యాలతో ప్రణాళిక సంఘం ముందుకు సాగింది. ఏర్పడిన నాటి నుంచి మొత్తం 12 పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టింది.
ప్రధాని నేతృత్వంలో పనిచేసే ప్రణాళిక సంఘంలో క్యాబినెట్ హోదా కలిగిన ఒక ఉపాధ్యక్షుడు, సెక్రటరీతోపాటు కొంతమంది మేధావులు సభ్యులుగా ఉంటారు.

విజయాలు.. విమర్శలు 

ఆరు దశాబ్ధాలకు పైగా ప్రణాళిక సంఘం ద్వారా అమలైన 12 పంచవర్ష ప్రణాళికలు దేశంలో అనేక విజయాలు సాధించాయి. కొన్ని చేదు అనుభవాలనూ మిగిల్చాయి. స్వాతంత్య్రం సాధించిన
తొలినాళ్లలో దేశాభివృద్ధిలో పంచవర్ష ప్రణాళికల పాత్ర అమోఘమని చెప్పవచ్చు. పంచవర్ష ప్రణాళికలే లేకపోతే ప్రభుత్వాలకు దిశా నిర్దేశం ఉండేది కాదన్నంతగా ఇవి ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అయితే క్రమంగా ప్రణాళిక సంఘం పాత్రపై విమర్శలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం సాధించిన దశాబ్దాల తర్వాత కూడా అసమానతలు, పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యాలను సాధించడంలో
ప్రణాళిక సంఘం విఫలమయ్యిందనే భావన నెలకొంది. ఆర్థిక వనరుల పంపిణీపై ఆదేశాలు జారీచేసే స్థాయిలో పనిచేసే ప్రణాళిక సంఘం కేంద్ర-రాష్ట్ర సంబంధాలకు అడ్డంకిగా మారిందని,
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా ఉందన్న అభిప్రాయం బలపడుతూ వచ్చింది. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన ఆర్థిక సంఘం కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం కూడా సరికాదని
ఆర్థిక నిపుణులు వాదిస్తూ వచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణల వైపు దేశం ప్రయాణిస్తున్న తరుణంలో ప్రపంచ స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడు స్పందించాల్సిన
ఈ సందర్భంలో ప్రణాళిక సంఘం ఔచిత్యం ప్రశ్నార్థకం అయ్యింది.


నీతిఆయోగ్ వ్యవస్థ 

ప్రణాళిక సంఘం ఔచిత్యం ప్రశ్నార్థకమైన నేపథ్యంలో.. 2014లో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది.
ప్రణాళిక సంఘంలోని లోటుపాట్లను సరిదిద్దే విధంగా దాని స్థానంలో 2015 జనవరి 1న నీతిఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా)ను ప్రవేశపెట్టింది.
భిన్న సంస్కృతులు, భాషలు, భావాలు, ప్రాంతాలు, భౌగోళిక పరిస్థితులు, జాతులు, వనరులతో.. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో అన్ని ప్రాంతాలకు ఒకే అభివృద్ధి మంత్రం పని
చేయదనే విషయాన్ని గుర్తించి ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలయినా అనుకున్న ఫలితాలను సాధించలేవని,
దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే ఆర్థిక సంస్కరణలతో పాటు పరిపాలన విధానాల్లో కూడా ఎప్పటికప్పుడు మార్పులు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.


స్వరూపం

ప్రధానమంత్రి నేతృత్వంలోని నీతిఆయోగ్‌లో ఒక ఉపాధ్యక్షుడు, రాష్ట్రాల ముఖ్య మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులు.
ప్రస్తుతం నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులుగా అరవింద్ పణగారియా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన అంశాలపై నిర్ణయాల కోసం ముఖ్యమంత్రులతో కూడిన ఉప సంఘాల
రూపంలో నీతిఆయోగ్ పని చేస్తుంది. ఉదాహరణకు స్వచ్ఛభారత్‌కు సంబంధించిన బృందానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..
కేంద్ర ప్రాయోజిత పథకాల హేతుబద్ధీకరణకు సంబంధించిన బృందానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ విధంగా నీతి ఆయోగ్ ప్రభుత్వానికి ఒక మేధోమథన బృందంగా, ఒక సలహా మండలిగా, కేంద్ర రాష్ట్రాల కౌన్సిల్‌గా, వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా
పలురకాల పాత్రలను పోషిస్తుంది. రాష్ట్రాల మధ్య వైవిధ్యాలను, వివిధ ప్రాంతాల బలాలను, బలహీనతలను గుర్తిస్తుంది. ఆభివృద్ధి పథంలో వివిధ దశల్లో ఉన్న
రాష్ట్రాల అవసరాలను గుర్తించి చర్యలను సూచించే విధంగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది. దీనివల్ల విధానాలు మరింత పటిష్టంగా తయారయ్యే అవకాశం ఉంటుంది.
నీతి ఆయోగ్ వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య విభేదాలు నెలకొనకుండా ఉంటాయి. దీని వల్ల రాష్ట్రాలు కేంద్రాన్ని అభ్యర్థించే పరిస్థితి ఏర్పడదు. కాబట్టి నీతిఆయోగ్‌ను మారిన
అవసరాలకు తగిందిగా, సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసే సంస్థగా భావంచవచ్చు. నీతి ఆయోగ్ మొదటి సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ నీతి ఆయోగ్ భారతదేశం
తలరాతను మార్చే టీమ్ ఇండియాగా అభివర్ణించారు.


ప్రణాళికలు.. లక్ష్యాలు 

* 1951లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయంతో పాటు, నీటి పారుదల, ఇంధన శక్తి, రవాణా, సామాజిక అభివృద్ధి లాంటి అంశాలపై దృష్టి సారించారు.
మొదటి పంచవర్ష ప్రణాళికలో భాగంగా యూజీసీ, అయిదు ఐఐటీలు లాంటి సంస్థలు ప్రారంభమయ్యాయి.
* 1956-61 మధ్య కాలంలో అమలైన రెండో పంచవర్ష ప్రణాళిక ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
* 1961-66 మధ్య కార్యరూపంలోకి వచ్చిన మూడో పంచవర్ష ప్రణాళిక చైనాతో జరిగిన యుద్ధం, దేశంలో ఏర్పడిన కరవు దృష్ట్యా రక్షణ, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది.
* మూడో పంచవర్ష ప్రణాళిక వైఫల్యం, వనరుల లేమి, ద్రవ్యోల్బణం పెరుగుదల లాంటి కారణాల వల్ల 1966-69 మధ్యకాలంలో కేవలం వార్షిక ప్రణాళికలకే పరిమితం అయ్యారు.
* 1969-74 మధ్య అమలైన నాలుగో పంచవర్ష ప్రణాళిక బ్యాంకులను ప్రభుత్వపరం చేయడం, హరిత విప్లవం, పేదరిక నిర్మూలన లాంటి చర్యలకు నాంది పలికింది.
* 1974-79 మధ్య ప్రవేశపెట్టిన 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టింది.ఇదే సమయంలో జాతీయ రహదారుల వ్యవస్థను ప్రవేశపెట్టారు.
1978-80లో నిరంతర ప్రణాళికను అమలు చేశారు.
* 1980-85 మధ్య సాగిన ఆరో పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక సరళీకరణలపై దృష్టి పెట్టారు.
* 1985-90 మధ్య కాలంలో కార్యరూపం దాల్చిన ఏడో పంచవర్ష ప్రణాళిక పారిశ్రామిక ఉత్పత్తుల్లో ప్రగతి, ఉపాధికల్పన అంశాల్లో క్రియాశీలం అయింది.
* 1990-92 మధ్య నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభాల కారణంగా పంచవర్ష ప్రణాళిక అమలు కాలేదు. కేవలం వార్షిక ప్రణాళికల ఆధారంగా నిర్ణయాలు జరిగాయి.
* 1992-97 మధ్య అమలైన 8వ పంచవర్ష ప్రణాళికలో ఆర్థిక వ్యవస్థను విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా తయారుచేసే విధంగా సంస్కరణలు చేపట్టడం.. పరిశ్రమలను ఆధునికీకరించడం
లాంటి వాటికి ప్రాధాన్యం ఇచ్చారు.
* 1997-2002 మధ్య అమలైన 9వ పంచవర్ష ప్రణాళిక ఆర్థిక, సామాజిక, గ్రామీణాభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టింది.
* 2002-07 సంవత్సరాల్లో 10వ పంచవర్ష ప్రణాళిక అమల్లోకి వచ్చింది. ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పనలకు ప్రాధాన్యం ఇచ్చారు.
* 2007-12 మధ్య సాగిన 11వ పంచవర్ష ప్రణాళిక ద్వారా సమ్మిళిత ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలన, సామాజిక రంగాలపై దృష్టి సారించారు.
* పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై 2012-17 మధ్య పనిచేయాల్సిన 12వ పంచవర్ష ప్రణాళిక 2014లో మోదీ ప్రభుత్వం నిర్ణయంతో మధ్యలోనే ఆగింది.


వర్తమానాంశాలు - అంతర్జాతీయం  -  3

విశ్వసుందరి కీరీటాన్ని దక్కించుకున్నదెవరు? భారత్ వద్దంటున్నా చైనా ఏ విషయంలో ముందుకెళుతోంది? విద్యుదుత్పత్తిలో ప్రపంచ రికార్డు స్థాపించిన ప్రాజెక్టు ఏది?
బ్రిటన్ ప్రవాస జనాభాలో ఎక్కువ మంది ఏ దేశస్థులు? అత్యంత ఉష్ణంతో ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన సంవత్సరం ఏది? చైనా ఎలాంటి పాఠ్యపుస్తకాలను నిషేధించింది?
ఫ్రాన్స్‌కు చెందిన ఏ వారపత్రిక కార్యాలయంపై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు? - పోటీ పరీక్షల్లో మంచి మార్కుల సాధనకు ఉపకరించే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశ్వవ్యాప్త విశేషాల సమాహారం..

'త్రీ గోర్జెస్' ప్రపంచ రికార్డు

చైనాలోని త్రీ గోర్జెస్ పవర్ ప్రాజెక్టు 2014లో 98.8 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అంతవరకు బ్రెజిల్‌లోని ఇటాయిపు జల విద్యుత్తు కర్మాగారం నెలకొల్పిన
ప్రపంచ రికార్డును త్రీ గోర్జెస్ అధిగమించింది. 2013లో బ్రెజిల్ ప్రాజెక్టు 98.6 బిలియన్ కిలోవాట్ అవర్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. స్థాపక సామర్థ్యం అంశంలో త్రీ గోర్జెస్ ప్రపంచంలోనే
అతిపెద్ద విద్యుత్తు కర్మాగారం. దీని స్థాపక సామర్థ్యం 22.5 మిలియన్ కిలోవాట్లు కాగా, బ్రెజిల్ ప్రాజెక్టు సామర్థ్యం 14 మిలియన్ కిలోవాట్లు. యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీ గోర్జెస్ ప్రాజెక్టు విద్యుత్తును
ఉత్పత్తి చేయడంతో పాటు వరదలను నియంత్రిస్తుంది. నౌకాయానానికి వీలు కల్పిస్తుంది.

బ్రిటన్‌లో భారతీయులు

బ్రిటన్ జనాభాలో అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రవాసీయులుగా భారత సంతతికి చెందినవారు నిలిచారు. వారి సంఖ్య 2013లో 7.34 లక్షలకు చేరుకున్నట్లు బ్రిటన్ జాతీయ
గణాంక విభాగ కార్యాలయం 2015లో ప్రకటించింది. బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి వ్యక్తుల సంఖ్య 2004లో 2.32 లక్షలు ఉండగా 2013 నాటికి అది 7 లక్షలను దాటడం విశేషం.
దీంతో ఇప్పటివరకూ బ్రిటన్‌లో అత్యధిక సంఖ్యాక ప్రవాసీయులుగా ఐర్లాండ్ జాతీయుల పేరిట ఉన్న రికార్డు భారతీయ సంతతి వ్యక్తుల సొంతమైంది.
భారత మామిడిపళ్లపై నిషేధం ఎత్తివేత

భారత్ నుంచి దిగుమతి అయ్యే మామిడిపళ్లపై 8 నెలలుగా విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని 2015 జనవరిలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది.
మామిడిపళ్లపై పురుగు మందుల అవశేషాల దృష్ట్యా 2014 మే ఒకటో తేదీ నుంచి 2015 డిసెంబరు వరకు నిషేధం విధిస్తున్నట్లు ఈయూ గతంలో ప్రకటించింది.
భారత్ నుంచి ఎగుమతయ్యే పళ్లు, కూరగాయల్లో 50 శాతం ఈయూ దేశాలకే వెళ్తున్నాయి. భారత్‌లో ఏటా 15-16 లక్షల టన్నుల మామిడి ఉత్పత్తి అవుతుండగా వాటిలో
70 వేల టన్నులను ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తున్నారు. 2013-14లో రూ.304 కోట్ల విలువైన మామిడిని భారత్ ఎగుమతి చేసింది.

పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం

విద్యార్థులపై పాశ్చాత్య భావనల ప్రభావం లేకుండా చూసేందుకు చైనా ప్రభుత్వం ఆ దేశ యూనివర్సిటీల్లో పాశ్చాత్య పాఠ్యపుస్తకాలపై నిషేధం విధించింది.
కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని నిందించే విధంగా ఉండే ఏ పుస్తకమూ వర్సిటీల్లో కనిపించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. చైనాలో యూనివర్సిటీలు అధికార
కమ్యూనిస్టు పార్టీ ఆధీనంలో నడుస్తాయి. చరిత్ర, పార్టీ అధికారానికి ముప్పు తెచ్చే ఇతర సున్నితమైన అంశాలను పార్టీ ఆదేశానుసారమే వర్సిటీల్లో చర్చించాల్సి ఉంటుంది.

తేమ లెక్కలను తేల్చే రాకెట్

నేలలోని తేమకు సంబంధించిన కచ్చితమైన లెక్కలను సేకరించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) 2015 జనవరిలో ఎస్ఎంఏపీ
(సాయిల్ మాయిశ్చర్ యాక్టివ్ పాసివ్) ఉపగ్రహాన్ని డెల్టా-2 రాకెట్ ద్వారా వాండెన్‌బర్గ్ వైమానిక స్థావరం నుంచి ప్రయోగించింది. భూమి మీదున్న మొత్తం తేమలో ఒక్క శాతమే నేలపై ఉంటుంది.
97 శాతం సముద్రాల్లోనూ, మిగతాది మంచులోనూ నిక్షిప్తమై ఉంటుంది. స్వల్ప మొత్తంలో నేలలో ఉన్న తేమకు, భూమిపై ఉన్న వాతావరణ వ్యవస్థల (నీరు, శక్తి, కర్బన సైకిళ్లు)తో సంబంధం ఉంది.
కొన్ని ప్రాంతాల్లో వరదలు లేదా కరవు తలెత్తడం వెనుక ఈ తేమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ నేపథ్యంలో దీని తీరుతెన్నులను పరిశీలించడానికి నాసా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.

వీగిపోయిన 'పాలస్తీనా' తీర్మానం

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే తీర్మానాన్ని 2014 డిసెంబరు 31న భద్రతామండలిలో ప్రవేశపెట్టగా దానికి ఆమోదం లభించలేదు.
2017 కల్లా పాలస్తీనా భూభాగం నుంచి ఇజ్రాయిల్ దళాలను ఉపసంహరించాలన్న ఈ తీర్మానం వీగిపోయింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 8 దేశాలు,
వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. భద్రతామండలిలోని 5 శాశ్వత సభ్య దేశాల్లో ఒకటైన అమెరికా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది.

భారత్ అభ్యంతరాలను చెబుతున్నా..

భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికీ సిల్క్ మార్గం ప్రాజెక్టుపై ముందుకే వెళ్తున్న చైనా ఆ ప్రాజెక్టుపై మిగిలిన దేశాల్లో అపనమ్మకాలు నెలకొన్నాయని
ఇటీవల వెల్లడించింది. ఆ అపనమ్మకాలను తాము తొలగిస్తామని పేర్కొంది.
* నూతన సిల్క్ మార్గం ప్రాజెక్టులో చైనాను మధ్య ఆసియా ద్వారా యారప్‌తో కలిపే పురాతన మార్గం కూడా ఉంది. బంగ్లాదేశ్-చైనా -ఇండియా-మయన్మార్ (బీసీఐఎం) ఆర్థిక కారిడార్ చైనా,
పాకిస్థాన్‌లను పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ద్వారా కలుపుతుంది. సముద్ర సిల్క్ మార్గం చైనాను పలు నౌకాశ్రయాలతో కలుపుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే పెద్దమొత్తంలో చైనా నిధులను కేటాయించింది.

బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్

గూగుల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), సహ వ్యవస్థాపకుడు లారీపేజ్‌ను 2014 సంవత్సరానికి 'బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌'గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకటించింది.
ప్రపంచంలోని అగ్రశ్రేణి 20 మంది కార్పొరేట్ ప్రముఖుల్లో లారీపేజ్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఇ-కామర్స్ పోర్టల్ 'అలీబాబా' సహ వ్యవస్థాపకుడు జాక్ మా, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్,
యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫాస్ట్‌ఫుడ్ గొలుసుకట్టు సంస్థ చిపోటిల్ సహ సీఈవోలు మోరన్, స్టీవ్ ఎల్స్; ఫెడెక్స్ ఛైర్మన్ ఫ్రెడ్ స్మిత్ కంటే లారీపేజ్ ముందు నిలిచారు.
విశ్వసుందరి.. పౌలినా వెగా

మిస్ యూనివర్స్ - 2014గా కొలంబియాకు చెందిన పౌలినా వెగా (22) కిరీటాన్ని గెల్చుకుంది. 2015 జనవరి 25న అమెరికాలోని మియామీలో జరిగిన ఈ పోటీల్లో ప్రపంచం
నలుమూలల నుంచి వచ్చిన 88 మంది అందగత్తెలను పక్కకునెట్టి వెగా విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో మొదటి రన్నరప్‌గా నియా శాంచెజ్ (అమెరికా),
రెండో రన్నరప్‌గా డయానా హర్కుషా (ఉక్రెయిన్) నిలిచారు.
* ఇవి 63వ మిస్ యూనివర్స్ పోటీలు. భారత్‌కు చెందిన నొయోనితా లోథ్ టాప్ 15లో నిలిచింది.
* మొదటి మిస్ యూనివర్స్ పోటీలను కాలిఫోర్నియాలోని లాంగ్ బీచ్‌లో 1952లో నిర్వహించారు. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన అర్మి కూసెలా విజేతగా నిలిచింది.
'కాన్ఫిడెంట్లీ బ్యూటిఫుల్' అనేది మిస్ యూనివర్స్ పోటీల నినాదం. 1998లో మిస్ యూనివర్స్ పోటీల లోగోను 'ది ఉమెన్ విత్ స్టార్స్' పేరిట రూపొందించారు.
న్యూయార్క్‌లోని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ ఏటా ఈ అందాల పోటీలను నిర్వహిస్తోంది. 1994లో సుస్మితాసేన్, 2000లో లారాదత్తా భారత్‌కు ఈ టైటిల్‌ను సాధించి పెట్టారు.

ఇటలీ నూతన అధ్యక్షుడు మట్టరెళ్ల

ఇటలీ 12వ అధ్యక్షుడిగా సెర్గియో మట్టరెళ్ల 2015 జనవరి 31న ఎన్నికయ్యారు. ఆ దేశ పార్లమెంటు సంయుక్త సమావేశంలో నిర్వహించిన నాలుగో
ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఇటలీ రాజ్యాంగ కోర్టు జడ్జి సెర్గియో మట్టరెళ్ల ఎన్నికయ్యారు. మొత్తం 1009 ఓట్లకు గాను 665 ఓట్లు గెలుచుకుని మట్టరెళ్ల విజయం సాధించారు.
సిసిలీ మాఫియా చేతిలో తన సోదరుడి హత్యానంతరం మట్టరెళ్ల క్రిస్టియన్ డెమోక్రటిక్ తరఫున 1980లో రాజకీయాల్లో ప్రవేశించారు.

11 ఏళ్లకు కనిపించిన 'బీగిల్-2'

2003 డిసెంబరు 19న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) ప్రయోగించిన 'బీగిల్-2' స్పేస్‌క్రాఫ్ట్ 11 ఏళ్ల తర్వాత 2015లో తిరిగి కనబడింది.
వాస్తవంగా 2003 డిసెంబరు 25 నాటికి అంగారకుడిపైకి చేరుకుని సంకేతాలు పంపాల్సిన ఈ వ్యోమనౌక నుంచి అప్పట్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో
2004 ఫిబ్రవరిలో ఈ ప్రయోగం విఫలమైనట్లు ఈఎస్ఏ ప్రకటించింది. తాజాగా అంగారకుడిపై అన్వేషణకు నాసా పంపిన 'మార్స్ రికన్నైజాన్స్ ఆర్బిటర్' స్పేస్‌క్రాఫ్ట్‌లోని
హై రిజల్యూషన్ కెమెరా తీసిన చిత్రాల్లో కుజుడి ఉపరితలంపై బీగిల్-2 కనిపించింది. దాని సౌర ఫలకాల్లో ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల యాంటెన్నా పని చేయలేదని,
 అందుకే ఇన్నాళ్లూ అది సంకేతాలు పంపలేక పోయిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వేడెక్కి పోయింది

అత్యంత ఉష్ణ సంవత్సరంగా 2014 రికార్డుల్లోకి ఎక్కింది. 1880తో పోలిస్తే గతేడాది ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రత 0.8 డిగ్రీల సెల్సియస్ మేర
పెరిగిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (నోవా) శాస్త్రవేత్తలు తేల్చారు. నాసాకు చెందిన
గొడార్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ స్టడీస్ (జీఐఎస్ఎస్) పరిశోధకులు భూతలంపై 6300 వాతావరణ కేంద్రాల సాయంతోనూ, నౌకల ద్వారా సముద్రంలోనూ,
అంటార్కిటికా పరిశోధన కేంద్రాల సాయంతోనూ పరిశీలనలు జరిపి ఈ నిర్ధారణకు వచ్చారు. ప్రామాణిక ప్రాతిపదికగా తీసుకున్న 1951 నుంచి 1980 మధ్య కాలంతో పోలిస్తే
ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతలో వచ్చిన వైరుధ్యం ఆధారంగా దీన్ని నిర్ధారించారు. ఉష్ణోగ్రతల పెరుగుదలలో ఎక్కువ భాగం గత మూడు, నాలుగు దశాబ్దాల్లోనే చోటు చేసుకుంది.
10 అత్యంత ఉష్ణ సంవత్సరాల్లో తొమ్మిది 2000 సంవత్సరం తర్వాతే నమోదయ్యాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సౌదీ రాజు మరణం

సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ అల్‌సౌద్ దేశ రాజధాని రియాద్‌లో 2015, జనవరి 23న మృతి చెందారు.
అబ్దుల్లా మృతదేహాన్ని నిరాడంబరంగా ఇమామ్ తుర్కిబిన్ అబ్దుల్లా మసీదు వద్ద ఖననం చేశారు. సౌదీ అరేబియా రాజుగా 2005
ఆగస్టు 1న సింహాసనాన్ని అధిష్ఠించినా.. అంతకు ముందు నుంచే అబ్దుల్లా (దాదాపు రెండు దశాబ్దాల పాటు) పరిపాలన సాగించారు.
2005లో సౌదీ రాజుగా అధికారికంగా నియమితుడైనప్పటికీ 1996 నుంచే అబ్దుల్లా దేశ పాలనా బాధ్యతలు నిర్వర్తించారు.
1996లో నాటి రాజు ఫాద్ గుండెపోటుకు గురవడంతో అబ్దుల్లా పాలనా పగ్గాలు చేపట్టారు.
* అగ్రరాజ్యం అమెరికాకు మధ్య ప్రాచ్యంలో విశ్వసనీయ నేస్తంగా.. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకించారు.
 ఆయనకు భారత్ అంటే అభిమానం. 2006లో భారత గణతంత్ర ఉత్సవాలకు అబ్దుల్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సౌదీని సంస్కరణల పథంలో నడిపించిన అబ్దుల్లా మహిళలకు ఓటు హక్కు కల్పించడమే కాకుండా వారికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు.
ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాధినేతల్లో అబ్దుల్లాది మూడో స్థానం. ఆయన వ్యక్తిగత ఆస్తి విలువ రూ. లక్ష కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
* అబ్దుల్లా మరణించిన నేపథ్యంలో బ్రిటన్ సామ్రాజ్ఞి ఎలిజబెత్-2 ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వయోవృద్ధురాలైన పాలకురాలిగా నిలిచారు.

'ఛార్లీహెబ్డో'పై దాడి

ఫ్రాన్స్‌కు చెందిన వ్యంగ్య రచనల వారపత్రిక 'ఛార్లీహెబ్డో' కార్యాలయంపై 2015 జనవరి 7న అల్‌ఖైదా గ్రూపునకు చెందిన దుండగులు కాల్పులు జరిపారు.
ఈ దుశ్చర్యలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్యారిస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో పత్రిక ప్రధాన సంపాదకుడు, కాలమిస్ట్ స్టీఫెన్ ఛార్బొనైర్,
వ్యంగ్య చిత్రకారులు కాబు, టిగ్నస్, వోలిన్‌స్కీ తదితరులున్నారు. 1970లో ఈ పత్రికను స్థాపించారు. మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యంగ్య చిత్రాలను ప్రచురించినందుకు
2006లో ఈ పత్రికపై విమర్శలు వెల్లువెత్తాయి. 2011లోనూ ఇలాంటి ప్రచురణ చేసినందుకు పత్రికపై దాడులు జరిగాయి. ఫ్రాన్స్‌ను సమీప భవిష్యత్తులో ఇస్లామిక్ ప్రభుత్వం పాలిస్తుందని
చెప్పే ఊహాచిత్రాన్ని కవర్‌పేజీపై ముద్రించిన నేపథ్యంలో.. 2015లో దాడి ఘటన చోటు చేసుకుంది. ఛార్లీహెబ్డో వెలువరించిన 1177వ సంచిక వివాదాస్పద రీతిలో ఈ దాడి ఘటనకు కారణమైంది.

మాదిరి ప్రశ్నలు

1. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఖుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్ ఏ దేశంలో ఉంది?
జ: పాకిస్థాన్
2. 'రెటీనైటిస్ పిగ్మెంటోసా' అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది?
జ: కళ్లు
3. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశాలను ఏటా జనవరిలో ఎక్కడ నిర్వహిస్తారు?
జ: దావోస్
4. 2014 డిసెంబరు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య ఎంత?
జ: 139 కోట్లు
5. వన్డే క్రికెట్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న వికెట్ కీపర్‌గా ఇటీవల ఎవరు రికార్డులకెక్కారు?
జ: కుమార సంగక్కర
6. ఆఫ్రికన్ యూనియన్ వార్షిక సదస్సును 2015 జనవరిలో ఎక్కడ నిర్వహించారు?
జ: అడీస్ అబాబా
7. రెల్ బ్యాంక్స్ సంస్థ రూపొందించిన.. 2014 సంవత్సరానికి గాను ప్రపంచంలోని అత్యంత విలువైన 50 బ్యాంకుల జాబితాలో చోటు పొందిన (45వ స్థానం) ఏకైక భారతీయ బ్యాంకు ఏది?
జ: హెచ్‌డీఎఫ్‌సీ

No comments:

Post a Comment

JOBS OPPORTUNITIES IN MANCHERIAL

మంచేరియల్ లో ఉద్యోగ అవకాశాలు