9200 Panchayat Secretary Posts Approved by Cm KCR Notification Will be Released Soon...
త్వరలో 9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురు అందించింది. త్వరలో 9,200 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేయనుంది. వారం రోజుల్లోగా ఈ నియామకాల ప్రక్రియ ప్రారంభించి రెండు నెలల్లోపు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి ఒక పంచాయతీ కార్యదర్శి కచ్చితంగా ఉండాలని, పల్లె సీమల అభివృద్ధిలో కార్యదర్శులు కీలకపాత్ర పోషించాలని సీఎం అన్నారు.
రాష్ట్రంలో ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఖచ్చితంగా ఉండే విధంగా కొత్తగా 9,200 మంది పంచాయితీ కార్యదర్శులను నియమించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. వారం రోజుల్లోగా నియామక ప్రక్రియ ప్రారంభించి, రెండు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్న పెద్దా అనే తేడాలేకుండా ప్రతీ గ్రామానికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉండాలని, పల్లెసీమలను ప్రగతి సీమలుగా మార్చే బృహత్తర కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని సీఎం ఆకాంక్షించారు. కొత్తగా నియామకమయ్యే 9,200 పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ల వరకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరు ఆధారంగా వారిని క్రమబద్దీకరించాలని, విధులు నిర్వహించలేని వారిని క్రమబద్దీకరించకుండా ఉండే విధంగా విధానం రూపొందించాలని సీఎం చెప్పారు. ప్రొబేషన్ సమయంలో నెలకు రూ.15,000 చొప్పున జీతం ఇవ్వాలని ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలని చెప్పారు. పంచాయితీ రాజ్ శాఖ ఆధ్వర్యంలోనే, జిల్లా కేడర్ లో కార్యదర్శుల నియామకాలు జరపాలని చెప్పాలి.
రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయితీలున్నాయి. ఇందులో ప్రస్తుతం 3,562 పంచాయితీలకు కార్యదర్శులున్నారు. ఇటీవలే ప్రభుత్వం కొత్తగా గ్రామ పంచాయితీలను ఏర్పాటు చేసింది. పాత గ్రామ పంచాయితీల్లో కూడ ఖాళీలున్నాయి. అన్ని గ్రామాలకు ప్రత్యేకంగా పంచాయితీ కార్యదర్శులుండాలని, ఒక కార్యదర్శి మరో పంచాయితీకి ఇన్ చార్జిగా ఉండే విధానానికి స్వస్తి పలకాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా కొత్తగా 9,200 మందిని పంచాయితీ కార్యదర్శులుగా నియమించాలని చెప్పారు. నియామక ప్రక్రియ, పంచాయితీ కార్యదర్శుల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై విధి విధానాలు రూపొందించాల్సిందిగా పంచాయిత్ రాజ్ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, కమిషనర్ శ్రీమతి నీతూ ప్రసాద్ లను ఆదేశించారు. పంచాయితీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నట్లు ప్రకటించారు.
‘‘గ్రామాలను వికాస కేంద్రాలుగా, ఆదర్శ గ్రామాలుగా మార్చేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలు అని నమ్ముతున్నది. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది. కాబట్టి గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. పరిపాలన సౌలభ్యం కోసం, తండాలు, గూడేలు, మారుమూల ప్రాంతాలు, శివారు పల్లెలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో కొత్త పంచాయితీలను కూడా ఏర్పాటు చేసింది. పంచాయితీల పరిధిలో హరితహారం కార్యక్రమం అమలు చేయడం, గ్రామాల పరిశుభ్రత, పన్నుల వసూలు, మురికి కాలువల నిర్మాణం-నిర్వహణ, విద్యుత్ దీపాల నిర్వహణ, అంటు వ్యాధులు ప్రబలకుండా చూడడం, దోమల నివారణ, స్మశాన వాటికల నిర్మాణం, డంప్ యార్డుల ఏర్పాటు లాంటి ఎన్నో బాధ్యతలు గ్రామ పంచాయితీకున్నాయి. గ్రామ పంచాయితీ పాలక వర్గంతో కలిసి గ్రామ కార్యదర్శి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శి విధిగా ఉండాలి. అందుకే 200 జనాభా కలిగిన గ్రామానికి కూడా ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని నిర్ణయించాం. వారంతా కష్టపడి పనిచేస్తే రెండు మూడేళ్లలోనే ఎంతో మార్పు వస్తుంది. తెలంగాణ గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా వెలుగొందుతాయి. దేశ వ్యాప్తంగా ఆదర్శ గ్రామాలెక్కడున్నాయంటే తెలంగాణలోనే అనే పేరు వస్తుంది’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
LINK.
Source :Telangana CMO Facebook Release & Eenadu
No comments:
Post a Comment